కొవిడ్ టీకా వేయించుకునేందుకు పట్టణానికి వెళ్తున్న వృద్ధురాలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై దండుమల్కాపురం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యాదమ్మ అనే వృద్ధురాలు(70).. మరో ఇద్దరితో కలిసి టీకా వేయించుకునేందుకు చౌటుప్పల్ బయలుదేరింది. ఆసమయంలో దండుమల్కాపురం గేటు వద్ద రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించింది.
అధికారుల నిర్లక్ష్యంతోనే
జాతీయ రహదారిపై అండర్ పాస్ వంతెన నిర్మించకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపించారు. మృతిని నిరసిస్తూ రహదారిపై ఆందోళన నిర్వహించారు. గ్రామానికి ఆర్టీసీ సదుపాయం కూడా లేదని బంధువులు ఆరోపిస్తూ రాస్తారోకో చేపట్టారు. దీంతో ఎన్‌హెచ్‌పై ఇరువైపులా 2కి.మీల మేర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. రంగప్రవేశం చేసిన పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి.. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు.
ఇదీ చదవండి: Harish rao: అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై మంత్రి హరీశ్ సమీక్ష