Odisha Fake Liquor Supply in Telangana: నకిలీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రట్టు చేశారు. ఈ ముఠా ఒడిశా కటక్ అటవీ ప్రాంతంలో తయారీ కేంద్రం ఏర్పాటు చేసింది. మద్యం దుకాణాల నుంచి సేకరించిన సీసాలు, అట్టపెట్టెలు సేకరించి.. చెక్కు చెదరకుండా వాటిలోనే నకిలీ మద్యం సీసాలు అమర్చి ముఠా సరఫరా చేస్తోంది. సమాచారం అందడంతో.. ఇబ్రహీంపట్నం ఎక్సైజ్ అధికారులు యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామంలో తనిఖీలు చేశారు.
నకిలీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. మద్యం అమ్ముతున్న చెట్టిపల్లి రాజును అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా నకిలీ మద్యం సరఫరా చేస్తున్న వనస్థలిపురానికి చెందిన గోపీకృష్ణను పట్టుకున్నారు. సూర్యనగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లోని అతని స్థావరాలపై దాడి చేసి మద్యం స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లాలోనూ అధికారులు నకిలీ మద్యం గుర్తించి కేసు నమోదు చేశారు.
ఒడిశా నుంచి నకిలీ మద్యం రాష్ట్రానికి సరఫరా అవుతున్నట్టు గుర్తించిన ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఒడిశాలోని కటక్ జిల్లా టాంగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అభయ్‌పూర్ అటవీ ప్రాంతంలోని నకిలీ మద్యం తయారీ కేంద్రంలో దాడులు చేశారు. మద్యం నాణ్యత పరికరాలు, ఆర్ఓ యంత్రం, లేబుళ్లు, స్టిక్కర్లు, మద్యం సీసాలను గుర్తించారు. అటవీ ప్రాంతంలోని స్థలాన్ని లీజుకు తీసుకుని నకిలీ మద్యం తయారీ కేంద్రం నడిపిస్తున్న ఒడిశాకు చెందిన రంజిత్ సమాల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో బింగి బాలరాజు, శివారెడ్డి, నాగేశ్వర్‌రావు, మణికంఠ, రంజిత్ సమాల్, సంజయ్‌కుమార్, సాయిప్రసాద్, గోపీకృష్ణ, రాజును అరెస్టు చేశారు. నకిలీ మద్యం ముఠా వెనుక ఎవరున్నా వదిలేది లేదని ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. నకిలీ మద్యం వ్యవహారంలో అధికారులు, సిబ్బంది ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి ముఠా ఆటకట్టించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.
"తెలంగాణలో ఏ రాష్ట్రం వాళ్లు అక్రమ మంద్యం తయారీ, విక్రయిస్తే శక్షిస్తాం. ఈ ముఠాపై పూర్తి స్థాయి పరిశోధన చేస్తాం. ఇలా అక్రమంగా తయారు చేస్తున్నారని ఎప్వరికైనా అనుమానం వస్తే తెలియజేయండి." -శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి
ఇవీ చదవండి: