హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన బాబు మృతి చెందాడు. ఈ నెల 5న ప్రసవం కోసం ఏరియా ఆస్పత్రికి నిండు గర్భిణీ వెళ్లింది. ఆస్పత్రిలో చేర్చుకున్న వైద్యులు.. ఆమెకు పురిటి నొప్పులు వచ్చినప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. 3 రోజుల తర్వాత ఆపరేషన్ చేసి శిశువును బంధువులకు అప్పగించారు. కాగా బాబు అప్పటికే ఉమ్మనీరు తాగి మృతి చెందాడని వైద్యులు చెప్పారు.
డాక్టర్లు సరైన సమయంలో ప్రసవం చేయకుండా నిర్లక్ష్యంగా ఉండటంతోనే తమ బాబు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
'మూడు రోజులుగా ప్రసవం కోసం ఎదురుచూస్తూ ఉన్నాం. కనీసం తనను చూడటానికి కూడా ఆస్పత్రి సిబ్బంది రాలేదు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాబు చనిపోయాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.' -బాధిత మహిళ బంధువు
ఇదీ చదవండి: COUPLE SUICIDE: కరోనా కాటుకు దంపతుల ఆత్మహత్య.. అనాథలైన పిల్లలు