భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఇందిరానగర్ ఎంపీటీసీ మండల రాముపై హత్యాయత్నం జరిగింది. బుధవారం అర్ధరాత్రి జేకే కాలనీ నుంచి మోటార్ బైక్పై ఇంటికి వెళ్తున్న రామును కారులో కొందరు దుండగులు వెంబడించారు. గమనించిన రాము మరో మార్గంలో వెళ్తుండగా.. అక్కడే మాటు వేసిన మరికొందరు అతడిపై దాడికి యత్నించారు. అప్రమత్తమైన బాధితుడు చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకోవటంతో ప్రాణాపాయం తప్పింది.
ఈ విషయంపై ఎంపీటీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరి వల్ల తనకు ప్రాణభయం ఉందని.. తనను అంతమొందించాలని చూస్తున్న వారిని అరెస్టు చేయాలని కోరాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దాడి కోసం ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.
గతంలోనూ ఎంపీటీసీ రాముపై కొందరు హత్యాయత్నం చేయడం.. ఆ ఘటనలో నిందితులు జైలుకు వెళ్లి రావడం జరిగింది.