Munagala Road Accident: సూర్యాపేట జిల్లా మునగాల శివారులో విషాధం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న లారీ ట్రాక్టర్‌ను ఢీకొనడంతో అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. మునగాలకు చెందిన కొంతమంది.. సమీపంలోని సాగర్ ఎడమ కాలువ గట్టుపై ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం రాత్రి పడిపూజకు హాజరయ్యారు. వారిలో దాదాపు 38 మంది ట్రాక్టర్ ట్రాలీలో ఇళ్లకు తిరుగుపయనమయ్యారు.
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వస్తుండగా ట్రాక్టర్ డ్రైవర్ యూటర్న్ తీసుకంటే దూరం ఎక్కువ అవుతుందని.. రాంగ్‌రూట్‌లో వెళ్లాడు. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వేగంగా వెళ్తున్న లారీ ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ దుర్ఘటనలో చనిపోయిన మృతులు ఉదయ్ లోకేష్, తన్నీరు ప్రమీల, దండు జ్యోతి, చింతకాయల ప్రమీల, కోటయ్యగా గుర్తించారు. ప్రమాద జరిగిన చోటు నుంచి క్షతగాత్రులను కోదాడ ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ సరిపోలేదు. అందుబాటులో ఉన్న వాహనాల్లో స్థానికులే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
మునగాల వద్ద గ్రామస్థుల ఆందోళన: పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఖమ్మం, సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ రాంగ్ రూట్‌లో వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ దుర్ఘటనపై మునగాల వద్ద గ్రామస్థులు ఆందోళన చేశారు. శవపరీక్ష తర్వాత మృతదేహాలను మునగాలకు తీసుకురాగా.. ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. తమ గ్రామానికి సర్వీసు రోడ్డు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని మృతుల బంధువులు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: Selfie Suicide: 'ఈ అమ్మాయి కనిపించేంత మంచిది కాదు సార్.. నా పిల్లల్ని కాపాడండి'
61కేజీల బంగారం స్మగ్లింగ్.. విలువ రూ.30 కోట్ల పైనే.. ఎలా తెచ్చారంటే..?