Mother Kills Son in AP: నిద్రమత్తులో ఉన్న యువకుడు తెల్లారేసరికి తీవ్రమైన గాయాలతో ఇంట్లోనే విగతజీవిలా పడి ఉన్నాడు. స్థానికుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఆశ్యర్యపోయే విషయం తెలిసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లిలో మంగళవారం తెల్లవారు జామున జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. పెద్దఅవుటపల్లికి చెందిన ఉప్పలపాటి దీప్‌చంద్(29) గృహోపకరణాల పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి ఇంకా వివాహం కాలేదు. తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. డ్రైవర్‌గా పని చేసే తండ్రి తెల్లవారు జామున 5 గంటలకే విధులకు వెళ్లాడు. అనంతరం కొద్దిసేపటికే తల్లి రమాదేవి పాలు తీసేందుకని బయటకు వెళ్లి తిరిగొచ్చే సరికి.. దీప్‌చంద్ ఇంట్లో తీవ్రగాయాలతో చనిపోయి రక్తపు మడుగులో కనిపించాడని ఆమె చెప్పింది. పోలీసులు సమాచారం అందడంతో ఘటనాస్థలిని పరిశీలించామన్నారు. వీఆర్వో జీ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు.
ఈ దర్యాప్తులో దీప్ చంద్ రూ.50 లక్షల వరకు అప్పులు చేశాడని తేలింది. అప్పు ఇచ్చినవారు కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. కుమారుడు చేసిన అప్పుల కారణంగా కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కుమారుడు అప్పులు ఎక్కువై మరింత ఒత్తిడికి గురవుతున్నామని భావించిన తల్లి రమాదేవి ఇంట్లోని రొకలిబండతో నిద్రమత్తులో ఉన్న కుమారుడిని తలపై మోదిందని తేలింది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు రమాదేవిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ విజయపాల్ వెల్లడించారు.
ఇవీ చదవండి: