యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు కుమార్తెలకు ఉరేసి... తల్లి బలవన్మరణానికి పాల్పడింది. చౌటుప్పల్ మండల కేంద్రానికి చెందిన తోరుపునూరి వెంకటేష్, రాణిలకు ముగ్గురు ఆడపిల్లలు. భార్య, భర్తలిద్దరూ కూలీ చేస్తూ జీవనం సాగించేవారు. కరోనా సమయంలో పని దొరకడం అంతంత మాత్రంగానే ఉండడంతో వారి ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది.
తీవ్ర మనస్తాపంతో..
దీనికి తోడు భర్త తాగుడుకు అలవాటు పడ్డాడు. పిల్లల పోషణ భారం కావడంతో రాణి తీవ్ర మనస్తాపానికి గురైంది. భర్తను మద్యం మాన్పించేందుకు చాలా ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఎంతకీ భర్త మారకపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకుంది.
వాళ్లని కూడా...
ఆత్మహత్య చేసుకుంటే పిల్లలు ఏమైపోతారో అనుకుంటూ మథనపడేది. ముగ్గురు ఆడపిల్లలే కావడంతో... తాను చనిపోతే వారిని చూసుకునేందుకు ఎవరూ ముందుకు రారేమో అనుకుని భయపడింది. చివరకు తనతో పాటు పిల్లలని తీసుకుని వెళ్లిపోవాలనుకుంది.
చీరనే ఉరితాడుగా మార్చి
కన్నప్రేమ అడ్డువస్తున్నా... చేసేదేమి లేదనుకుంటూ ధైర్యం చెప్పుకుంది. తన చీరను బిడ్డలకు ఉయ్యాలగా మార్చినట్లు.. ఉరితాడుగా మార్చింది. ఒక్కొక్కరిని తన చేతులతోనే ఉరి వేస్తూ క్షోభను అనుభవించింది. అనంతరం ఆమె కూడా ఉరి వేసుకుని తనువు చాలించింది.
ఈ ఘటనలో చిన్న కూతురు మాత్రం అదృష్టవశాత్తు తప్పించుకుంది. మెడ నుంచి చీర జారడంతో చావు నుంచి బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాదంతో నిండిపోయింది. కుటుంబసభ్యుల రోదన స్థానికులను సైతం కంటతడి పెట్టించేలా చేసింది.
ఇదీ చూడండి: LORRY ACCIDENT: కృష్ణా జిల్లాలో లారీ బోల్తా.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి