Mother Killed Daughter: వివాహేతర సంబంధానికి అడ్డొచ్చిందని కన్న కూతురినే కడతేర్చిందో తల్లి. కని పెంచిన బంధాన్ని కామవాంఛతో కాలరాసింది. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బద్వేలు మండలం లక్ష్మీపాలెంలో ఈ దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమణమ్మ సమీప బంధువు శ్రీనయ్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. రోజూ వీరిద్దరూ ఏకాంతంగా ఉండటం.. రమణమ్మ కుమార్తె వెంకట సుజాత (17) కంట పడింది. తల్లి ప్రవర్తనపై సుజాత ఆగ్రహం వ్యక్తం చేసింది. తీరు మార్చుకోమని హెచ్చరించింది. అప్పటి నుంచి కొన్నాళ్లు దూరంగా ఉన్న రమణమ్మ, శ్రీనయ్య.. ఆ తర్వాత తమకు అడ్డుగా ఉన్న వెంకట సుజాతను అంతమెుందించాలని నిర్ణయం తీసుకున్నారు.
మెడకు చున్నీ బిగించి
గతేడాది అక్టోబరు 16న వెంకట సుజాత ఇంట్లో ఒంటరిగా ఉండటంతో ఇదే అదనుగా భావించిన తల్లి.. పథకం వేసింది. వెంటనే విషయాన్ని శ్రీనయ్యకు చేరవేసింది. వెంటనే.. మరో వ్యక్తి కొండయ్యతో కలిసి రమణమ్మ ఇంటికి వచ్చిన శ్రీనయ్య.. మంచంపై పడుకొని ఉన్న వెంకట సుజాత మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కొండయ్య ఆటోలో ఊరి చివర ఉన్న బావి వద్దకు తీసుకెళ్లి అందులో పడేశారు.
ఎటో వెళ్లిపోయిందని డ్రామా..
హత్య అనంతరం ఇంటికి చేరుకున్న రమణమ్మ.., తన కుతూరు ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని అమాయకంగా ఇరుగు పొరుగు వారిని నమ్మించింది. ఏమీ తెలియనట్లు వెంకట సుజాత కోసం సమీప ప్రాంతాల్లో వెతికింది. తండ్రి తాగుడుకు బానిస కావటంతో.., కొన్నాళ్లుగా వెంకట సుజాత మానసిక స్థితి బాగుండటం లేదని, అందుకే ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని అందరికీ చెప్పింది.
తీరుపై అనుమానం
రెండు రోజుల తర్వాత ఆమె మృతదేహం బావిలో కనిపించటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. తల్లి రమణమ్మ తీరు అనుమానాస్పదంగా ఉండటం.. పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండటంతో శ్రీనయ్య, కొండయ్యతో కలిసి తానే కూతురిని హత్య చేసి బావిలో పడేసినట్లు ఒప్పుకుంది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఇదీ చదవండి: 'లైంగికంగా వేధిస్తున్నాడని మైనర్ ఫిర్యాదు.. ప్రజాప్రతినిధిపై పోక్సో కేసు'