రాజకీయంగా తనకున్న ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గ్రండ్ర వెంకటరమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రూపిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ దంపతులు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
సర్పంచ్ బండారి కవిత, ఆమె భర్త దేవేందర్‌ను తాను దూషించలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వారే.. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. యూట్యూబ్ ఛానల్ ఓనర్ తీన్మార్ మల్లన్న ఒకరి అభిప్రాయం మాత్రమే స్వీకరించి కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ తనను డిమాండ్ చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. తన వ్యక్తిగత ఫోన్ నెంబర్‌ను యూట్యూబ్‌లో పెట్టినందుకు.. తానే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
ఈ నెల 4వ తేదీన మండలంలోని గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు నన్ను కలిశారు. దాదాపు గంట సేపు వారితో చర్చించా. భగవంతుని సాక్షిగా నేను ఎవరిని దూషించలేదు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటున్నా. ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాపై ఆరోపణలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటా.
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
ఇదీ చదవండి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్