- ధారూర్ మండలంలోని ఓ గ్రామంలో అక్టోబరు 2020లో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. అదే వీధిలో ఉండే 42 ఏళ్ల వ్యక్తితో ఆ చిన్నారి తరచూ మాట్లాడేది. తెలిసిన వ్యక్తే కదా అని తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పేవారు కాదు. కరోనా కారణంగా ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు పొలానికి వెళ్లాక భోజనం పెడతానని పాపను తన ఇంట్లోకి తీసుకెళ్లి సదరు వ్యక్తి అత్యాచారం చేశాడు. జరిగిన విషయాన్ని ఆ చిన్నారి బంధువులకు చెప్పడంతో వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించడంతో పోక్సో చట్టం కింద నమోదు చేశారు.
- గత మార్చిలో వికారాబాద్ పట్టణంలోని ఓ గురుకుల పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్న విద్యార్థి.నిపై 58 ఏళ్ల కాపలాదారు తరచూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకు రావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, సదరు వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపించారు.
చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులకు తాజా నిదర్శనాలివి. తెలిసిన వారే అనుకుంటే నమ్మించి వంచిస్తున్నారు. కూతురు, మనవరాలి వయసున్న బాలికలపై కొందరు వ్యక్తులు అమానుషంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే పరిణామం. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నిరంతరం అప్రమత్తంగా ఉంటేనే వీటికి అడ్డుకట్ట వేయవచ్చు.
మంచీ, చెడూ నేర్పాలిలా..
- చాకోబార్‌లు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు కొనిస్తామంటూ చెప్పి కొందరు ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి వారిపై లైంగికదాడులకు పాల్పడే అవకాశాలున్నాయి. బయటకు వెళ్లినప్పుడు ఇంటికి త్వరగా రావాలని సూచించండి.
- టీనేజ్‌లో ఉన్నవారికి వారి లైంగిక అవగాహన ఉండదు. ఈ విషయంలో తల్లులు తగిన జాగ్రత్తలు చెప్పాలి.
- బంధువులైనా సరే పురుషులకు దగ్గరగా కౌమారదశలో ఉన్న అమ్మాయిలను కూర్చోబెట్టకూడదు. వారితో బయటకు పంపొద్ధు
- బాబాయి, బావ, మామ, అన్న అంటూ చిన్న పిల్లలు బంధువులు కాని వారిని పిలుస్తున్నా అలాంటివారిపై నిఘా ఉంచండి. చనువుగా ప్రవర్తించడం, ముఖ్యంగా 13 ఏళ్ల నుంచి 15 ఏళ్ల అమ్మాయిలతో సన్నిహితంగా ఎవరున్నా సరే వెంటనే కఠినంగా వ్యవహరించండి.
- అత్యాచార ఘటనల్లో 90 శాతం మంది నిందితులు పరిచయస్తులే. బాధితులు ఫిర్యాదు చేసే వరకు నేరాలు బయటపడటం లేదు.
ఎక్కడపడితే అక్కడ ఇదే దుస్థితి
పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు విపరీతంగా శ్రమిస్తూ వారి వ్యక్తిగత అవసరాలు, ఇష్టాలు, స్నేహితులు ఇతర అంశాలపై పెద్దగా దృష్టి సారించడం లేదు. దీంతో చిన్నారులు, అమ్మాయిలను దగ్గరకు తీసుకునే నెపంతో కొందరు వారిపై లైంగికదాడులకు పాల్పడుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు, ఆటమైదానాలు, ట్యూషన్లు ఇలా ఎక్కడపడితే అక్కడ ఇదే దుస్థితి. 2019 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 177 మంది బాలికలపై అత్యాచార యత్నాలు, అత్యాచారాలు జరిగాయి. కొన్ని ఘటనలు బయటికి పొక్కనివ్వడం లేదు. జాతీయ నేర నివేదిక గణాంకాల ప్రకారం ముంబయి నగరంలో ఎక్కువగా జరుగుతున్నాయి. రెండో స్థానంలో బెంగళూరు ఉంది. వీటి తర్వాత దిల్లీ, పుణె, చెన్నై, కోల్‌కతా, నాగ్‌పూర్, హైదరాబాద్ నగరాలు వరుసగా ఉన్నాయి.
తల్లిదండ్రులూ గమనించాలి..
లైంగిక వేధింపులు, దాడుల నుంచి చిన్నారులు, బాలికలను కాపాడుకోవాలంటే తల్లితోపాటు చుట్టు పక్కలవారూ గమనించాలి. పట్టణాల్లో ఉన్న మహిళలు దృష్టి కేంద్రీకరించాలి. పిల్లలతో ఎవరైనా అసహజంగా ప్రవర్తిస్తున్నారా? బైక్‌పై తీసుకెళ్తున్నారా? లిఫ్ట్‌లో ఒంటరిగా తీసుకెళ్లి తెస్తున్నారా? పరిచయస్తులే కాకుండా బయటి వ్యక్తులు వచ్చి మాట్లాడుతున్నారా? అన్న అంశాలను పరిశీలించాలి. చిన్న పిల్లలు, కౌమారదశలో ఉన్న అమ్మాయిలకు లైంగిక జ్ఞానం ఉండదు. ఆటలు, చదువు, సెల్‌ఫోన్ గేమ్స్‌పైనే ధ్యాసంతా ఉంటుంది. మామయ్య, బాబాయి, అన్న.. అని పిలిపించుకునే దుర్మార్గులు దురుద్దేశంతో తమ శరీరాన్ని తాకినా పిల్లలు చెడుగా అనుకోరు. లైంగికదాడికి గురైన పిల్లల్లో 5 శాతం నుంచి 15 శాతం వరకు పిచ్చివాళ్లుగా మారుతున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని తగిన జాగ్రత్తలు పాటించాలి.
బాధితులను సంరక్షిస్తున్నాం
బాధితులను నేరుగా భరోసా కేంద్రాలకు పంపాలని పోలీస్ ఠాణాలను ఆదేశించాం. నిందితులపై ఐపీసీ కేసులతో పాటు పోక్సో చట్టం ప్రయోగిస్తున్నాం. వైద్య, న్యాయసేవలను సత్వరంగా అందేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు అవసరమైతే కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు చేయిస్తున్నాం. బాధితులందరినీ ముందుగా రక్షిత గృహాలకు పంపుతున్నాం. తల్లిదండ్రులు లేనివారు, కుటుంబ పరిస్థితులు అనువుగా లేని బాధితుల సంరక్షణ బాధ్యతలు చేపడుతున్నాం. స్వచ్ఛంద సేవాసంస్థల సహకారంతో విద్యాబుద్ధులతో పాటు ఉపాధి కల్పించాలని ప్రణాళిక సిద్ధం చేశాం.
- ఇదీ చూడండి : అమానుషం... చిన్నారిపై బాలుడి అత్యాచారం