ZPTC Murder in Siddipet District: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం గురిజకుంట గ్రామం టీఆర్ఎస్ నేత శెట్టి మల్లేశం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో చేర్యాల జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. తెల్లవారుజాము వాకింగ్‌కి ఇంటి నుంచి వెళ్లిన మల్లేశం.. గురిజకుంట శివారులోని చేర్యాల మార్గంలో కుప్పకూలిపోయాడు. స్థానికుల సమాచారంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు అక్కడికి చేరుకుని.. రక్తపుమడుగులో ఉన్న మల్లేశాన్ని సిద్దిపేటలోని ఆసుపత్రికి తరలించారు.
అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. మల్లేశం భార్య గతంలో సర్పంచ్‌గా పనిచేయగా.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన జడ్పీటీసీగా గెలిచారు. చేర్యాలలోని పెద్దమ్మగడ్డ జడ్పీహెచ్ఎస్లో చదువుకున్న మల్లేశం.. నిన్న జరిగిన పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. నిన్నంతా స్నేహితులు, గ్రామస్థులతో ఆనందంగా గడిపిన మల్లేశం.. మరుసటిరోజే హత్యకు గురికావటంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
అనుమానాస్పద స్థితిలో జడ్పీటీసీ మృతిచెందటంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. హుస్నాబాద్ ఏసీపీ, చేర్యాల సీఐ, ఎస్సైలతో సిద్దిపేట సీపీ శ్వేత ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనాస్థలిలో ఆధారాలు సేకరించిన పోలీసులు.. ప్రమాదవశాత్తు చనిపోయారా? లేదంటే ఎవరైనా హత్యచేశారా? అనే కోణంలో విచారణ ప్రారంభించారు. ప్రాథమిక విచారణ అనంతరం, జడ్పీటీసీని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు నిర్ధారించారు.
24 గంటల్లోగా నిందితులను పట్టుకుంటామని.. సీపీ శ్వేత తెలిపారు. జడ్పీటీసీ హత్యోదంతంపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆరా తీశారు. గ్రామానికి వెళ్లి.. మల్లేశం కుటుంబసభ్యులను ఓదార్చారు. ఇటీవల స్థానికంగా రాజకీయ గొడవలు, భూతగాదాలు జరుగుతున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఇదే వ్యవహారాల్లోనే మల్లేశంను హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. చేర్యాల జడ్పీటీసీ మృతి పట్ల మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కమిషనర్‌ను ఆయన ఆదేశించారు.
ఇవీ చదవండి: