పెళ్లి సమయంలో తల్లిదండ్రులు పెడతామన్న బంగారం పెట్టకపోవడంతో పుట్టింటి వారిపై అలిగి క్రిమిసంహారక గుళికలు వేసుకొంది ఓ వివాహిత. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మృతి చెందింది. ఈ సంఘటన వికారాబాద్ పురపాలక సంఘం పరిధిలోని అనంతగిరిపల్లిలో జరిగింది.
వికారాబాద్ జిల్లా అనంతగిరిపల్లికి చెందిన ఊరడి మమత(21), రామయ్యగూడకు చెందిన దుద్యాల నవీన్‌లు రెండేళ్ల కిందట ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో సర్దుబాటు కాకపోవడంతో 3 తులాల బంగారం (30 గ్రాములు) తరువాత పెడతామని మమత తండ్రి బాగయ్య హామీ ఇచ్చారు. తండ్రి ఆరోగ్యం క్షీణించి మంచాన పడడం, లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో కూతురుకు బంగారం పెట్టలేదు.
గుళికలు తీసుకుని..
ఇటీవల మమత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి బంగారం విషయం గుర్తు చేయగా, వాస్తవ పరిస్థితి వివరించి.. ఇంకొన్నాళ్లు ఆగమని సముదాయించారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె అక్కడే ఈ నెల 15న క్రిమిసంహారక గుళికలు వేసుకుంది. గుర్తించిన కుటుంబ సభ్యులు వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహించినా.. ఆరోగ్యం మెరుగుపడలేదు. ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందింది. వికారాబాద్ తహసీల్దార్ రవీందర్ పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
తల్లిదండ్రులు బంగారం ఇవ్వలేదని మనస్తాపమో... బంగారం తీసుకుని రావాలంటూ అత్తింట్లో పెట్టిన ఒత్తిడో తెలియదు కానీ... క్షణికావేశంలో ఆమె తనువును చాలించి ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది.
ఇదీ చూడండి: Ganjai Smuggling: పక్కా ప్రణాళికతో... గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
Vanasthalipuram police arrested a thief: ఆర్ఎంపీగా ఆదాయం లేదని.. దొంగ అవతారం ఎత్తాడు.. చివరికి