అత్తింటివారి వరకట్న వేధింపులు భరించలేక పెళ్లయిన పదినెలలకే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో జరిగింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ఖాసీంపూర్కు చెందిన అంబికను గతేడాది నవంబర్ 27న పటాన్‌చెరు మండలం పెదకంజర్ల గ్రామానికి చెందిన రాజిరెడ్డికి ఇచ్చి పెళ్లిచేశారు. వివాహ సమయంలో 15 తులాల బంగారం, రూ.6 లక్షల నగదు ఇచ్చారు. పది లక్షలు ఖర్చుచేసి ఘనంగా పెళ్లిచేశారు. అయితే పెళ్లయిన కొద్దిరోజులకే అత్త యాదమ్మ, భర్త రాజిరెడ్డితో అంబికకు వేధింపులు మొదలయ్యాయి.
అప్పులు అయ్యామని... అదనపు కట్నం తీసుకురావాలని చాలా సార్లు వేధించారు. పెద్దలకు చెప్పినా వారిలో మార్పురాలేదు. అంబిక కొన్నిసార్లు తల్లిదండ్రులకి చెప్పినా, మరికొన్నిసార్లు చెప్పలేక కొండంత భారంతో వేధింపులు భరించేది. కొద్దిరోజుల క్రితం అంబిక తల్లి రూ.50 వేలు కూతురుకు ఇచ్చింది. అయినా వేధింపులు ఆపకపోవడంతో ఈనెల 25న సాయంత్రం అంబిక ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను చికిత్సకోసం పటాన్‌చెరులో ఉన్న మాక్స్‌కేర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. మృతదేహాన్ని పటాన్‌చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి పరిశీలించి వరకట్న వేధింపుల కింద భర్త రాజిరెడ్డి, అత్త యాదమ్మలపై కేసు నమోదుచేసినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా కోడలు అంబిక ఆత్మహత్య చేసుకోవడానికి తానే కారణమనే భయంతో అత్త సైతం ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే తమ సోదరి అంబిక డిగ్రీ వరకూ చదువుకుందని ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె సోదరుడు చంద్రకాంత్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.
ఇదీ చదవండి: Husband murdered his wife: భార్య గర్భం దాల్చిందని గొంతు నులిమి చంపిన భర్త