పెళ్లి పేరుతో పదిన్నల లక్షలు దండుకొని ముఖం చాటేశాడు ఓ సైబర్ నేరగాడు. హైదరాబాద్ బేగంపేటకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తెలుగు మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్ పెట్టింది. యువతి ప్రొఫైల్ చూసిన దుండగుడు... మునగర్స్ మేహుల్ కుమార్‌గా పరిచయం చేసుకున్నాడు. అమెరికాలో పని చేస్తున్నానని యువతికి మాయమాటలు చెప్పాడు. తన ప్రొఫైల్ నచ్చిందని... తనను వివాహం చేసుకోవడానికి అంగీకారమే అని చెప్పి యువతితో పరిచయం పెంచుకున్నాడు.
ఒక దశలో వీసా పంపిస్తానని దీనికి రూ. 50 వేల ఖర్చు అవుతాయని నమ్మబలికాడు. అకౌంట్లో రూ. 50 వేలను యువతి డిపాజిట్ చేసింది. ఇంకోసారి గుజరాత్లో ఇల్లు కొన్నానని... దానికి మరమ్మతు చేసేందుకు డబ్బులు కావాలని తెలిపాడు. ఈ సాకుతో తన అకౌంట్లో రూ. 10 లక్షలు జమ చేయించుకున్నాడు. పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో... మాట దాటేయటం వల్ల యువతికి అనుమానం వచ్చింది. విచారణ చేయగా తాను మోసపోయినట్టు తెలుసుకుంది. హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు బాధిత యువతి ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.