International Day Against Domestic Violence: పలు కుటుంబాల్లో ఇలాంటి హింసలను ఎదుర్కొంటున్న మహిళలు.. గృహమే కదా నరక సీమగా వ్యవహరించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ఆధారంగా 30 శాతం మంది గృహిణులు సమస్యను ఎదుర్కొంటున్నట్లు గుర్తించింది. సామాజిక కట్టుబాట్ల కారణంగా వెలికిరాని కేసులు చేరిస్తే అది రెట్టింపు అవుతుంది. స్త్రీలపై హింసను నిరోధించడానికి ఐక్య రాజ్య సమితి ఈ నెల 25న అంతర్జాతీయ గృహహింస వ్యతిరేక దినంగా నిర్వహిస్తోంది. మన దేశంలో గృహహింస నిరోధక చట్టం-2006 తీసుకొచ్చారు.
Domestic Violence in Telangana : రాష్ట్రంలో చాలా మంది అతివలు గృహహింస వేధింపులకు గురవుతున్నారు. తీవ్రతపెరిగితే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాము పోతే పిల్లలు అన్యాయమైపోతారని వారితో సహా ఆత్మహత్య చేసుకుంటున్నారు. హింసకు కారణాల్లో ప్రధానంగా వరకట్నం, మత్తుకు బానిస, వివాహేతర సంబంధాలు, పేదరికం, ఆధిపత్య ధోరణి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
మొదట రాజీ..: సఖి కేంద్రాన్ని ఆశ్రయించిన వారికి మొదట కౌన్సెలింగ్ ఇచ్చి ఇరువురి మధ్య రాజీ కుదిర్చి కాపురం చేయాలని ప్రోత్సహిస్తారు. పరిస్థితులను బట్టి కేసులు, వైద్య సేవలు, కోర్టులో కేసు కొట్లాడేందుకు సాయం.. మార్గదర్శనం చేస్తారు. ఏ పరిస్థితిలో వచ్చినా మొదట వెల్‌కమ్ కిట్ ఇస్తారు. అందులో రెండు జతల దుస్తులు, చెప్పులు, బ్రష్ వంటివి ఉంటాయి. ఐదు రోజులు వసతి కల్పించి ఈలోగా పరిస్థితులు అనుకూలిస్తే కుటుంబ సభ్యుల వద్దకు, లేదా స్త్రీ శిశు సంక్షేమ శాఖ నిర్వహించే గృహానికి పంపిస్తారు.
2017లో సఖి కేంద్రం: నిజామాబాద్‌లో 2017లో సఖి కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రతినెల 50 వరకు అన్ని రకాల కేసులొస్తే వాటిలో 25-30 వరకు గృహహింసవే. వాటిలోనూ 70 శాతం వరకట్నం అంశాలే. ఇక ఆశ్రయించిన మహిళల్లో 80 శాతం భౌతిక దాడులకు గురైనవారుంటున్నారు.
హింసలు ఇలా:
భౌతిక దాడులు : తోసేయడం, కొట్టడం, ఆయుధాలతో దాడి.
లైంగికపరంగా : భార్యను బలవంతంగా కలయికకు ప్రేరేపించడం.
భావోద్వేగం : తక్కువ చేసి మాట్లాడటం, శరీరాకృతిని విమర్శించడం, పది మందిలో పరువు తీయడం, మాటలతో భయపెట్టడం, అనుమానించడం.
చట్టం ఏం చెబుతుందంటే:
కొట్టడంతో పాటు మాటలతో హింసించడమూ నేరమే. ఇందూరు జిల్లాకేంద్రంలో సఖి కేంద్రంలో గృహహింస కేసులు పరిష్కరిస్తున్నారు.'
రక్షణ: మహిళ విజ్ఞప్తి మేరకు భర్త, అత్తారింటి నుంచి దాడి జరగకుండా సమీప ఠాణా ద్వారా సంరక్షణ కల్పిస్తారు.'
నివాసం: ఇంట్లో నుంచి వెలివేసిన సందర్భంలో భర్త గృహంలోనే వసతి కల్పించడం, అద్దెకుంటే ఆ డబ్బులు చెల్లించేలా ఆదేశిస్తారు.
కస్టడీ: గృహిణి నుంచి పిల్లల్ని లాగేసుకున్న సందర్భంలో వారిని తల్లికి అప్పగించేలా చూస్తారు.
పరిహారం: గృహహింసలో గాయపడిన సందర్భంలో చికిత్స సహా వివిధ అంశాల్లో పరిహారం ఇప్పిస్తారు.
జీవనభృతి: భర్త నుంచి వేరుగా ఉంటే జీవనభృతి ఇప్పిస్తారు.
24 గంటలు సేవలందిస్తాం.
సఖి కేంద్రం 24/7 విధానంలో పనిచేస్తోంది. గృహహింసను ఎదుర్కొనేవారు సమీప అంగన్‌వాడీ టీచరు, ఆశా, స్వచ్ఛంద సంస్థల ద్వారా కేంద్రాన్ని ఆశ్రయించొచ్చు. ఉమెన్ హెల్ప్‌లైన్ 181 నంబరుకు ఫిర్యాదు చేయొచ్చు. సమస్యలో ఉన్న వారిని రక్షించడానికి ప్రత్యేక వాహనం అందుబాటులో ఉంటుంది.
ఇవీ చదవండి: