రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న పలు ప్రాంతాల్లో నాలాలు పొంగిపొర్లుతుండగా.. ఇళ్లలోకి వర్షపునీరు చేరి జనం ఇబ్బంది పడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో సాయంత్రం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలైన శివాజీనగర్, రాజీవ్‌నగర్, వెంకటేశ్వరకాలనీ నల్లకుంట తదితర చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. వాల్మీకినగర్‌కు చెందిన రాఘవేందర్(40) నాలాలో పడి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోగా.. శివాజీ నగర్ సమీపంలో అతని మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ జడ్చర్ల- నాగర్ కర్నూల్ ప్రధాన రహదారిపై స్థానికులు బైఠాయించారు. దాదాపు రెండు గంటల పాటు రాస్తారోకో చేశారు. ఎన్నో ఏళ్లుగా ఆ సమస్య ఉన్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న జడ్చర్ల పురపాలిక ఛైర్పర్సన్ లక్ష్మి, కమిషనర్ సునీత, స్థానిక నాయకులు అక్కడికి చేరుకుని స్థానికులను శాంతింపజేశారు. అనంతరం మృతదేహాన్ని బాగేపల్లి కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు.
భారీ వర్షాల నేపథ్యంలో జడ్చర్లలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరికతో నిత్యావసర సామగ్రి నీటమునిగిపోయింది. ఇంట్లో సామగ్రి అంతా తడిసిపోవడంతో ఏం చేయాలో తోచక పలు కుటుంబాలు భిక్కుభిక్కుమంటున్నాయి.
ఇదీ చదవండి: Rains in hyderabad: భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం