నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం బోర్గాం గ్రామానికి చెందిన అశోక్(30) కొన్ని రోజులుగా తీవ్రజ్వరంతో బాధ పడుతున్నారు. కరోనాపై అనుమానంతో తల్లి గంగామణి, సోదరుడు ఆదివారం రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చి పరీక్షలు చేయించారు. ర్యాపిడ్ ఫలితంలో నెగెటివ్‌గా వచ్చింది.
నెగిటివ్ వచ్చింది..
తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో మరోసారి పరీక్ష నిర్వహించాలని కుటుంబసభ్యులు సిబ్బందిని కోరారు. రెండో సారి నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ఫలితం రావడానికి సమయం పడుతుందనడంతో అశోక్ చెట్టు కింద కూర్చున్నారు. కొంతసేపటికి అక్కడే ప్రాణాలు వదిలారు.
అప్పటికే చనిపోయాడు..
అశోక్ కదలకపోవడంతో తల్లి.. దగ్గరికి వెళ్లి తట్టిచూసింది. అప్పటికే చనిపోయాడని గ్రహించి బోరుమంది. కుమారుడి మృతదేహాన్ని పట్టుకుని తల్లి రోదించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. కొద్దిసేపటికే రెండో సారి నిర్వహించిన ఫలితం రాగా.. అందులోనూ నెగెటివ్‌గా తేలింది. తీవ్రజ్వరంతో బాధపడుతున్న అశోక్ గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని ఆరోగ్య సిబ్బంది తెలిపారు. మృతదేహాన్ని కుటుంబీకులు ట్రాక్టర్‌లో గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య లక్ష్మి, ఆరేళ్ల కొడుకు ఉన్నారు. తల్లి గంగామణి పారిశుద్ధ్య కార్మికురాలు.
- ఇదీ చదవండి : ఆదర్శ దంపతులు: మరణంలోనూ ఒక్కటై..!