Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు మరో వ్యక్తి బలయ్యాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మామిడిపల్లికి చెందిన బొమ్మిడి రాజేంద్ర ప్రసాద్ (35) రుణ యాప్ ద్వారా 50 వేలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు వాయిదాల పద్ధతిలో చెల్లించే క్రమంలో కొంత ఆలస్యం కావటం వల్ల.. రోజూ ఫోన్ చేసి వేధింపులకు గురిచేశారు. నగ్న ఫొటోలను మొబైల్లో ఉన్న అన్ని ఫోన్ నెంబర్లకు పంపిస్తామని బ్లాక్ మెయిల్ చేయగా.. రాజేంద్ర ప్రసాద్ తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. బెదిరింపులు తట్టుకోలేక ఈ నెల 18న ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి రాజేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇరుగుపొరుగు వారు గమనించి హుటాహుటిన కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. రాజేంద్ర భార్య ఫిర్యాదు మేరకు లోన్ యాప్ సంస్థపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేసి చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. లోన్ యాప్ ద్వారా ఎవ్వరూ రుణాలు తీసుకోవద్దని ఎస్సై సాంబమూర్తి తెలిపారు. ఒకవేళ తీసుకున్నా.. వేధింపులకు గురిచేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి కానీ.. ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు.
ఇవీ చూడండి: