Threat with a gun: వారసత్వంగా వచ్చిన రూ.100కోట్ల ఆస్తి.. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లకు వాటాలివ్వకుండా మొత్తం కొట్టేయాలనుకున్న ఓ వ్యక్తి పథకం బెడిసికొట్టింది. తన తమ్ముడు అక్రమంగా ఆయుధాలుంచుకున్నాడంటూ జైలుకు పంపించాలని ప్రయత్నించాడు.. పోలీసులు వివరాలు సేకరించి పథకం వేసిన అన్ననే అరెస్టు చేశారు. బేగంపేట పీఎస్ పరిధిలోని రసూల్‌పురాలో జరిగిన ఈ ఘటన వివరాలను అదనపు సీపీ(నేర పరిశోధన) ఏఆర్.శ్రీనివాస్ గురువారం మీడియాకు వెల్లడించారు.
మొత్తం ఆస్తి తనకే వస్తుందని..
Revolver in brother's house: రసూల్‌పురలో నివాసముంటున్న షేక్ మహ్మద్ అహ్మద్ అజ్మతుల్లా స్టీల్ వ్యాపారం చేస్తున్నాడు. అతడి తండ్రి షేక్ ఇబ్రహీం నగరం, శివారుల్లో రూ.వంద కోట్ల ఆస్తులు సంపాదించాడు. ఈ ఆస్తులకు అజ్మతుల్లా, అతడి ఇద్దరు సోదరులు, ఏడుగురు అక్కాచెల్లెళ్లు వారసులు. అక్కాచెల్లెళ్లకు ఆస్తులపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో 15 ఏళ్ల నుంచి ఆ ఆస్తులు తనకే చెందాలని అజ్మతుల్లా వాదిస్తున్నాడు. ఈ క్రమంలో అన్న అబ్దుల్లా, తమ్ముడు సొహైల్‌ను తప్పిస్తే మొత్తం ఆస్తి తనకే వస్తుందని పథకం వేశాడు.
సోదరుడి ఇంట్లో రివాల్వర్, తూటాలుంచి..
Revolver in brother's house: తుపాకులు, రివాల్వర్లు, తూటాలను అక్రమంగా ఇంట్లో ఉంచుకుంటే పోలీసులు అరెస్టు చేస్తారని అజ్మతుల్లా తెలుసుకున్నాడు. తమ్ముడిని జైలుకు పంపించేందుకు ఇదే మార్గమని భావించాడు. కొద్దిరోజుల కిందట నాందేడ్ వెళ్లి దేశవాళీ రివాల్వర్, 10తూటాలను రూ.20వేలకు కొన్నాడు. అక్కడే కత్తులు తీసుకున్నాడు. రెండు రోజుల కిందట రహస్యంగా వాటిని సొహైల్ ఇంట్లో దాచాడు. అనంతరం ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఫోన్ చేసి.. ఫలానా వ్యక్తి ఇంట్లో ఆయుధాలున్నాయని చెప్పాడు. కొత్త సిమ్‌కార్డు తీసుకుని ఈ ఫోన్ చేసిన తర్వాత దాన్ని పడేశాడు. అజ్మతుల్లా ఇచ్చిన సమాచారంతో ఉత్తర మండలం ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు సొహైల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా, తనకు సంబంధం లేదని చెప్పడంతో దర్యాప్తు చేపట్టి.. అజ్మతుల్లానే ఇదంతా చేశాడని గుర్తించారు.
ఇదీ చదవండి:Telangana Realtors Murder Case: స్థిరాస్తి వ్యాపారులపై కాల్పుల కేసులో ఆరుగురు అరెస్టు