false information man arrest : విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు తప్పుడు సమాచారమిచ్చిన కేసులో ఓ వ్యక్తి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అసత్య సమాచారంతో పోలీసుల సమయాన్ని వృథా చేసినందుకుగానూ బానోత్ లాలూ అనే వ్యక్తి మూడు రోజులు శిక్ష అనుభవిస్తున్నాడు.
బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని నందీనగర్‌కు చెందిన బానోత్ లాలూ... ఈ నెల 18న రాత్రి పదిగంటల సమయంలో తన సోదరుడిని... తల్లిదండ్రులు హత్య చేశారని డయల్ 100కు ఫోన్ చేసి చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన.. సీఐతోపాటు ఇద్దరు ఎస్‌ఐలు ఇతర పోలీసు సిబ్బంది అతను చెప్పిన చిరునామాకు చేరుకున్నారు. దర్యాప్తులో బానోత్ లాలూ సోదరుడు నెల క్రితమే అనారోగ్యంతో చనిపోయాడని నిర్ధారణ అయింది.
పోలీసులు తప్పుడు సమాచారమిచ్చి సమయాన్ని వృథా చేశాడని కేసు నమోదు చేసి ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసును విచారించిన ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్... బానోత్ లాలూకు 3రోజుల జైలు శిక్ష విధించి చంచల్ గూడ జైలుకు పంపారని బంజారాహిల్స్ సీఐ శివచంద్ర వివరించారు.
ఇదీ చూడండి: Medchal Car Accident : చెట్టును ఢీకొని కారు నుజ్జునుజ్జు.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు