మహబూబ్‌నగర్ పట్టణంలో సంచలనం రేపిన ఉపాధ్యాయుని హత్య కేసులో నిందితుడు జగదీశ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను హత్య కోసం ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు మహబూబ్‌నగర్ డీఎస్పీ పేరిట ప్రకటన విడుదల చేశారు.
అసలేం జరిగిందంటే..?
మహబూబ్‌నగర్ పట్టణంలోని షాసాబ్‌గుట్ట నుంచి భగీరథ కాలనీ వెళ్లే.. మార్గంలో పసుల కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్‌కు సమీపంలో నరహరి అనే ఉపాద్యాయుడు ఈ నెల 10న హత్యకు గురయ్యాడు. భార్య అరుణ కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 17న నిందితున్ని మహబూబ్‌నగర్ బస్టాండ్‌లో అరెస్టు చేశారు. జగదీశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం పెద్దపల్లి జిల్లా నుంచి మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చారు. ప్లాట్ కొనుగోలు చేసే విషయంలో నరహరికి, జగదీశ్‌కి మధ్య పరిచయం ఏర్పడింది. దివిటిపల్లిలో ఏడున్నర ఎకరాల భూమి, రాజాపూర్‌లో 6 ఎకరాల మామిడితోట కొనుగోలు చేసినప్పుడు నిందితుడు నరహరి దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నాడు. వడ్డీ క్రమం తప్పకుండా చెల్లిస్తూ.. వచ్చేవాడు. లాక్డౌన్లో వడ్డీలు చెల్లించలేకపోయాడు. కోటి రూపాయల వరకూ నరహరికి బకాయి పడ్డాడు. డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా నరహరి ఒత్తిడి పెంచాడు.
ఈ విషయంలో ఇరువురి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. మార్చి 10న సాయంత్రం 6 గంటలకు జగదీశ్ ఇంటికి వెళ్లిన నరహరి డబ్బు తక్షణమే కావాలని లేదంటే రాజాపూర్ మామిడితోట తనపేరున రాయాలని డిమాండ్ చేశారు. తోట తనకే అమ్మాలనే ఒప్పందంపై జగదీశ్ భార్యతో సంతకం పెట్టించాల్సిందిగా కోరాడు. ఉదయం ఒప్పందంపై సంతకం పెడతానని జగదీశ్ చెప్పడంతో నరహరి అక్కడినుంచి బయలు దేరాడు. నరహరి ప్రవర్తనపై ఆగ్రహానికి గురైన జగదీశ్.. కారులో అతన్ని వెంబడించాడు. నిర్జన ప్రదేశంలోకి రాగానే కారుతో నరహరి బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. కింద పడిపోయిన నరహరిని వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో గొంతు కోసి హతమార్చాడు. ఎట్టకేలకు అతడిని పోలీసులు 17న అరెస్టు చేశారు.
- సంబంధిత కథనం: కారుతో ఢీకొట్టి... కత్తులతో తెగనరికి..