missing complaint in hyderabad: ప్రేమించి పెళ్లాడారు.. విడిపోయి అదృశ్యమయ్యారు! - తెలంగాణ వార్తలు
ప్రేమించి పెళ్లి చేసుకుంది ఓ ప్రేమజంట. జీవితాంతం కలిసి బతకాలనుకున్నారు ఆ ప్రేమికులు. ఇంతలో ఏమైందో కానీ పెద్దల సమక్షంలో విడిపోయారు. వేరుగా ఉంటామని అంగీకరించారు. కట్‌చేస్తే వారంరోజుల వ్యవధిలోనే ఇద్దరూ అదృశ్యమయ్యారు(missing complaint in hyderabad). అసలేం జరిగింది...?

వారిద్దరూ ప్రేమించుకున్నారు. కలిసిబతకాలని కోరుకున్నారు. అందుకే ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న ఆ జంట పెద్దల కౌన్సెలింగ్ తర్వాత వేర్వేరుగా ఉంటున్నారు. కట్‌చేస్తే... వారం రోజుల్లోనే ఇద్దరూ వేర్వేరుగా అదృశ్యమయ్యారు(missing complaint in hyderabad). ఈ మేరకు యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని ఎన్బీనగర్‌లో నివసించే విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి పెంటయ్య కుమారుడు టోనిరాజ్(23) గత నెల 27న తాను ప్రేమించిన యువతిని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నాడు. ఇది తెలుసుకున్న ఇరువర్గాల పెద్దలు కూర్చొని మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి వెళ్తానని తేల్చిచెప్పింది. దీంతో యువతి తల్లిదండ్రులతో వెళ్లగా యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లాడు.
అప్పటి నుంచి ఇద్దరు వేర్వేరుగానే ఉంటున్నారు. ఇదిలా ఉండగా 3న గజ్వేల్‌లో నివసించే స్వప్న తండ్రి పెంటయ్యకు ఫోన్ చేశారు. తన కుమార్తె కనిపించడం లేదని తెలియజేయగా అనుమానం వచ్చిన టోనీరాజ్ తండ్రి కుమారుడికి ఫోన్ చేశాడు. చరవాణి అందుబాటులో లేకుండా పోయింది. దీంతో అనుమానం వచ్చిన యువకుడి తండ్రి తన కుమారుడు అదృశ్యమయ్యాడంటూ(missing complaint in hyderabad) బంజారాహిల్స్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.