వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో కోళ్ల దాన బస్తాల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. భారీ శబ్దంతో రోడ్డు పక్కన ఉన్న ఇళ్లపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినప్పుడు కరెంటు వైర్లు తెగిఉంటే భారీ అగ్ని ప్రమాదమే జరిగి ఆస్తి నష్టం వాటిల్లేదని స్థానికులు పేర్కొన్నారు.
ఆ సమయంలో పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద గండం నుంచి బయటపడినట్లైంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్ర నుంచి ఖమ్మంకు కోళ్ల దాన చేరవేసేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఖమ్మం-వరంగల్ రహదారి కావటంతో ప్రతి రోజు ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు వాపోయారు. డ్రైవర్ అతివేగం, నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు.
ఇదీ చదవండి: Cricket Betting: తెలుగునాట క్రికెట్ బెట్టింగ్ జోరు.. బుకీల చేతుల్లో చిక్కి యువత బలి