వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మెరిపిరాలకు చెందిన సందీప్ అనే యువకుడు 10 రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడి మరణానికి కారణాలను, కారకులను కనిపెట్టేందుకు తీవ్రంగా శ్రమించి... 10 రోజుల తర్వాత కేసును చేధించారు. సందీప్‌కు తొలుత స్రవంతి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆమెను సందీప్ ఆప్యాయంగా అక్కా అని పిలిచేవాడు. ఆమె తమ్ముడు అని పిలిచేది. కొన్నిరోజుల తర్వాత స్రవంతి తన స్నేహితురాలు కావ్యను సందీప్‌కు పరిచయం చేసింది. అది కాస్త ప్రేమగా మారింది. దాదాపు 8 నెలలు సందీప్-కావ్య ఫోన్‌లో ప్రేమించుకున్నారు. అంతలోనే కావ్యకు వేరే వారితో పెళ్లి జరిగింది. కొన్నిరోజులకు భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చేసింది.
నీవల్లేనని భయపెట్టించి..
తాళిబొట్టు, మెట్టెలు తీసేసి ఇంట్లోనే ఉండిపోయింది. సందీప్ వల్లే కావ్య అలా చేసిందని స్రవంతి అంటూ ఉండేది. ఎప్పుడూ కావ్యను పెళ్లి చేసుకుంటానని సందీప్ చెబుతుండేవాడు. ఆ క్రమంలోనే సందీప్‌కు కావ్య చెల్లెలు మనీషను.. స్రవంతి పరిచయం చేసింది. ఇంట్లో కావ్య పరిస్థితిని ఆమె చేరవేసేది. ఇంట్లో గొడవలు జరిగాయని.. ఉన్నట్టుండి కావ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు సందీప్‌కు మనీష చెప్పింది. కావ్య మృతికి... నువ్వే కారణమని స్రవంతి బెదిరించడంతో ఆందోళనకు గురైన అ యువకుడు... పొలం వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
కాల్స్‌ను విశ్లేషించగా..
ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. ఆత్మహత్యపై దర్యాప్తు మొదలెట్టిన పోలీసులు... అతడి ఫోన్‌కు వచ్చిన కాల్స్ ఆధారంగా విచారణలో ముందుకెళ్లారు. వేర్వేరు నంబర్లతో తరచూ కాల్స్ రావడం గమనించి వాటిపై దృష్టిసారించారు. ఆ కాల్స్‌ను విశ్లేషించగా.. అసలు నిజం బయటపడింది. మాయమాటలతో సందీప్‌ను మోసం చేసి అతడి మరణానికి కారణమైన స్రవంతిని.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందుకు అన్ని ఆధారాలు సేకరించారు.
ఇది చూడండి:
TRAGEDY: రాఖీ రోజు విషాదం.. అక్క మరణాన్ని తట్టుకోలేక తమ్ముడు మృతి!