Karvy MD Parthasarathi: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ఎండీ పార్థసారథిని ఈడీ ప్రత్యేక న్యాయస్థానం నాలుగు రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈడీ అధికారులు పార్థసారథిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నారు. పెట్టుబడిదారుల షేర్లను నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకుల్లో తనఖా పెట్టిన పార్థసారథి... ఆ నిధులను డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. డొల్ల కంపెనీల్లో ఖాతాల నుంచి నగదును మళ్లించి... ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పార్థసారథి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు పలు బ్యాంకుల వివరాలు తెలుసుకోవడంతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
మనీ లాండరింగ్‌కు సంబంధించి పార్థసారథిని ప్రశ్నించడం ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవాలని ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఇది వరకే కేసు నమోదు చేసి పార్థసారథితో పాటు కార్వీ సంస్థ డైరెక్టర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీసీఎస్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూర్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పార్థసారథిని ఈడీ అధికారులు ఐదు రోజుల క్రితం పీటీ వారెంట్ పై తీసుకొచ్చి ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు చంచల్ గూడ జైలుకు 14రోజుల రోజుల రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: