Jubilee hills case: జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో జువైనల్ జస్టిస్ కోర్టులో వాదనలు ముగిశాయి. ముగ్గురు మైనర్లను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై జువైనల్ జస్టిస్ కోర్టులో విచారణ జరిగింది. బాలనేరస్థుల కస్టడీపై జువైనల్ జస్టిస్ బోర్డు రేపు తీర్పు వెలువరించనుంది. జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో నిన్న మరో ఇద్దరు మైనర్లను అరెస్టు చేశారు. వారిద్దరిని జువైనల్ హోమ్‌కు పోలీసులు తరలించారు.
ఏ1కు నాలుగు రోజుల కస్టడీ: జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసు నిందితుడు సాదుద్దీన్‌ను నాలుగు రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సాదుద్దీన్‌ను.. రేపటి నుంచి కస్టడీలోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించనున్నారు. కాగా బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో సాదుద్దీన్(18) ప్రధాన నిందితుడు(ఏ1)గా ఉన్నాడు. మిగిలిన అయిదుగురూ మైనర్లు. మే 28న ఈ సంఘటన జరిగింది.
ప్రధాన నిందితుడు సాదుద్ధీన్ కాబట్టి.. ఇతను మైనర్లను ఏవిధంగా ప్రోత్సహించాడు? బాలికను ఎలా మభ్యపెట్టి వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లారు? తదితర విషయాలను క్షుణ్నంగా తెలుసుకోవటానికి కస్టడీకి తీసుకున్నారు. మరింత సమాచారం అతని నుంచి రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. కస్టడీ ముగిసిన అనంతరం సాదుద్ధీన్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచి తిరిగి రిమాండ్‌కు తరలించనున్నారు.