Jahind Naik Murder Case Update: సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహడ్ తండాకు చెందిన జైహింద్‌నాయక్(30) మొండేన్ని హైదరాబాద్ శివారు తుర్కయాంజాల్ కమ్మగూడలో తూర్పు సూరజ్‌నగర్ కాలనీలోని ఓ భవనంలో పోలీసులు గురువారం గుర్తించారు. జైహింద్ మొండేన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఘటనాస్థలిలో ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
జైహింద్‌నాయక్ తల ఐదు రోజుల క్రితం నల్గొండ జిల్లా చింతపల్లి విరాట్‌నగర్‌లోని మహంకాళి అమ్మవారి విగ్రహం వద్ద లభించిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన నల్గొండ సీసీఎస్ డీఎస్పీ మొగులయ్య, పోలీసులు తుర్కయాంజాల్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంటాడన్న సమాచారంతో ఇక్కడ మూడు రోజులుగా గాలింపు చేపట్టారు. జైహింద్‌నాయక్ రోజూ ఓ భవనంలో పడుకుంటాడని గురువారం సాయంత్రం ఓ వ్యక్తి సమాచారం అందించాడు. తూర్పు సూరజ్‌నగర్ కాలనీ ఎస్‌మార్ట్ సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న ఆ భవనంలో పరిశీలించగా.. ఓ గదిలో ఇటుకల కింద మొండెం కనిపించింది. అతడిని ఇక్కడే హత్య చేసి.. తలను వేరుచేసి దాదాపు 50 కి.మీ. దూరంలోని చింతపల్లి విరాట్‌నగర్‌కు తీసుకెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దుస్తులు, ఇతర ఆధారాలతో మొండెం జైహింద్‌దేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సాంకేతికంగా ధ్రువీకరించడానికి అతడి, తల్లిదండ్రుల డీఎన్‌ఏ నమూనాలను పరీక్షకు పంపించారు.
ఆరునెలలుగా ఈ భవనంలోనేే..
జైహింద్‌నాయక్‌కు మతిస్థిమితం లేకపోవడంతో ఎక్కడికి వెళ్లినా తల్లిదండ్రులు తోడుండేవారు. ఏడాది క్రితం తుర్కయాంజాల్‌కు వచ్చిన అతడు ఇక్కడే ఉంటానని చెప్పాడు. వారు కొద్దిరోజులుండి వెళ్లిపోయారు. అతడు భిక్షాటన చేసుకుంటూ ఉండేవాడు. మొండెం లభించిన భవనంలోనే ఆరు నెలలుగా రాత్రిపూట తలదాచుకుంటున్నాడు. నల్గొండ జిల్లాకు చెందినవారు, జైహింద్ నాయక్‌కు తెలిసినవారే హత్య చేసి ఉండొచ్చని వారు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: అమ్మవారి పాదాల వద్ద మొండెం లేని తల.. హత్యా...? నరబలా..?