తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలకు పాల్పడే 11 మంది అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను ప్రత్యేక పోలీసు బృందం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ రమణరాజు తెలిపారు. మేడ్చల్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ఈ ముఠా మధ్యప్రదేశ్‌కు చెందింది. వీరు మొత్తం 60 మంది. సంచార జాతుల మాదిరిగా ఆవాసాలు ఏర్పాటు చేసుకుని, ఉదయం రుద్రాక్షలు, ఆయుర్వేద మందులు అమ్మేవారి లాగా రెక్కీ నిర్వహిస్తారు. రెండు, మూడు రోజులుగా తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తారు. రాత్రి సమయంలో తాళాలు పగులగొట్టి నగదు, బంగారం ఎత్తుకెళ్తారు. చోరీలు చేయగానే సొంత గ్రామాలకు వెళ్లి వస్తువులను అమ్ముకుని వస్తారు. ఏసీపీ రమణరాజు
ఈ ముఠా సంచార జాతుల మాదిరిగా గుడారాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా చోరీలకు పాల్పడినట్లు ఏసీపీ పేర్కొన్నారు. మేడ్చల్, శామీర్‌పేట్, బాలానగర్, అల్వాల్, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 20 కేసులు నమోదైనట్లు తెలిపారు. ప్రధాన నిందితులు బల్వా, కొలం, ఠాకూర్, పెక్లోడ్లు పరారీలో ఉన్నారన్నారు. నిందితుల నుంచి రూ.1.40 లక్షల నగదు, 2 ద్విచక్ర వాహనాలు, 3.8 తులాల బంగారం, 26 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో మచ్చబొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు.
ఇదీ చూడండి: నయీం కేసులో తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశం