కరీంనగర్ శివారులోని నగునూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. కాన్పు కోసం వచ్చిన ఓ మహిళకు గర్భశోకమే మిగిలింది. వైద్య విద్యార్థులతో కాన్పు చేయించడం వల్ల పురిట్లోనే శిశువు చనిపోయిందని బాధితులు ఆందోళనకు దిగారు. గోదావరిఖనికి చెందిన అనూష కాన్పు కోసం ఆస్పత్రికి వచ్చారని... కానీ ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె భర్త అన్వేష్ రెడ్డి ఆరోపించారు. కాన్పు చేయడంలో జాప్యం చేయడంతో పసిపాప మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ ఆస్పత్రి యాజమాన్యం విద్యార్థుల కోసం మాత్రమే నడుపుతున్నారని... వైద్యం కోసం వచ్చే వారి కోసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయని ఆరోపించారు. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా శిశువు చనిపోయిందని బాధిత కుటుంబసభ్యులు నగునూర్ రోడ్డుపై బైఠాయించారు. యాజమాన్యం, పీజీ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు నచ్చజెప్పి... ఆందోళన విరమింపజేశారు.
ఇదీ చదవండి: child died: నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి