హైదరాబాద్‌కు చెందిన హెటెరో ఫార్మా గ్రూప్‌లో (IT RAIDS ON HETERO DRUGS) నిర్వహించిన సోదాల్లో దాదాపు రూ.550 కోట్ల నల్లధనం వెలుగుచూసినట్లు ఆదాయపన్నుశాఖ వెల్లడించింది. రూ.142 కోట్ల లెక్కలు చూపని ధనాన్ని జప్తు చేసినట్లు తెలిపింది. దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొంది. ఈ వివరాలతో శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
నాలుగు రోజులుగా ఈ సంస్థలో ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఔషధ రంగంలో ఇంటర్ మీడియేట్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రేడియంట్స్, ఫార్ములేషన్లు తయారుచేసే ఈ ప్రధాన గ్రూప్‌నకు చెందిన 6 రాష్ట్రాల్లోని 50 కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు ఐటీశాఖ వెల్లడించింది. ‘‘సోదాల్లో కొన్ని రహస్య స్థావరాలను, 16 లాకర్లను గుర్తించాం. వీటిలో రెండో జత ఖాతాల పుస్తకాలు, లెక్కచూపని నగదు లభించాయి. పెన్‌డ్రైవ్‌లు, దస్తావేజుల రూపంలో నేర నిరూపణకు అవసరమైన సాక్ష్యాధారాలు దొరికాయి. ఈఆర్‌పీ, శాప్ సాఫ్ట్‌వేర్ల నుంచి నేరనిరూపణకు డిజిటల్ సాక్ష్యాలు సేకరించాం. బోగస్, మనుగడలో లేని సంస్థల నుంచి కొనుగోళ్లు చేసినట్లు చూపడంతో పాటు కొన్ని ఖర్చులను కృత్రిమంగా పెంచిన విషయాలను గుర్తించాం. (IT RAIDS ON HETERO DRUGS))నగదు చెల్లింపుల ద్వారా భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్ విలువ కంటే తక్కువ మొత్తానికి కొనుగోలు చేయడం, ఉద్యోగుల వ్యక్తిగత వ్యయాలను కంపెనీ పుస్తకాల్లో పొందుపరచడం తదితర విషయాలనూ గుర్తించాం’’ అని ఆదాయపన్నుశాఖ పేర్కొంది.
నక్కపల్లి యూనిట్‌లో ముగిసిన సోదాలు
ఏపీలోని విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండల పరిధిలోని హెటెరో ఔషధ పరిశ్రమలో (IT RAIDS ON HETERO DRUGS) ఐటీ అధికారులు నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న సోదాలు శనివారంతో ముగిశాయి. అధికారుల బృందంలో కొందరు శుక్రవారం రాత్రే వెళ్లిపోగా, మిగిలిన వారు శనివారం మధ్యాహ్నం వెనుదిరిగారు. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, దస్త్రాలు, హార్డ్‌డిస్కులను వెంట తీసుకెళ్లారు.
సంబంధిత కథనాలు..