ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం ఎస్ కొండాపూర్ పంచాయతీ పరిధి రాతల తండాకు చెందిన రాతల బాలు హత్యకు గురయ్యారు. మృతుడి సోదరులు చందు, రాములు పథకం ప్రకారం హత్య చేశారంటూ మృతుని భార్య లక్ష్మి ఆరోపించారు.
రెండు నెలల కిందట బాలు... చందు, రాములు అన్నదమ్ముల మధ్య గొడవ జరగగా... పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఎవరు గొడవ పడ్డ రూ.5 లక్షల జరిమానా విధిస్తామని పంచాయతీ పెద్దలు తీర్పు ఇవ్వగా గొడవ అంతటితో సద్దుమణిగింది. తండాలో నివసిస్తే బతకలేను అంటూ బాలు అతని భార్య లక్ష్మి కుమారుడు నరేశ్‌తో కలిసి హైదరాబాద్ వెళ్లి జీవనం సాగిస్తున్నారు.
2 రోజుల క్రితం పొలం చూడడానికి బాలు తండాకు వచ్చాడని... శనివారం రాత్రి తీవ్రంగా గాయపడ్డారని తండావాసులు ఫోన్ చేసి చెప్పగా భార్య, కుమారుడు తండాకు చేరుకున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో బాలు మృతిచెందాడు, మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు చిన్న శంకరం పేట పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబీకులు, బంధువులు తండాకు చేరుకొని న్యాయం జరిగేంత వరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని గొడవకు దిగారు.
ఇదీ చదవండి: యంత్రంలో రూపాయి పెట్టు.. మాస్కు పట్టు!