Hyderabad Taskforce Constable crimes: నేరస్తులతో దోస్తీ చేస్తూ దొంగల నాయకుడిగా మారిన నగర టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ ఈశ్వర్ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇటీవల నల్గొండ పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు చిన్నారులు, మహిళను అదుపులోకి తీసుకొని ప్రశ్నించటంతో ఇతడి బండారం బట్టబయలైంది. పక్కా ఆధారాలతో సోమవారం నల్గొండ పోలీసులు కానిస్టేబుల్ ఈశ్వర్‌ను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. ఇతడికి సహకరించిన మరో కానిస్టేబుల్‌పైనా విచారణకు ఆదేశించారు.
గ్యాంగ్‌స్టర్‌గా ఎదగాలనే కోరిక: 2010 బ్యాచ్ కానిస్టేబుల్ ఈశ్వర్‌కు గ్యాంగ్‌స్టర్‌గా ఎదగాలనే కోరిక. సహచర కానిస్టేబుల్‌తో స్నేహం పెంచుకున్నాడు. గాంధీనగర్, చిక్కడపల్లి, ఎస్సాఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్లలో వీరిద్దరూ కలిసే పనిచేశారు. పలుకుబడితో ఇద్దరూ టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ చేయించుకున్నారు. గాంధీనగర్‌లో ఓ పోలీసు అధికారి తోడ్పాటుతో నేరస్తుల నుంచి సొత్తు గుంజటం ప్రారంభించారు. ఈ సంపాదన చాలక దొంగల ముఠాలనే రూపొందించడం ప్రారంభించారు. చోరీలు చేయించి వాటాలు పంచుకున్నారు. అనంతరం పంపకాల్లో విభేదాలతో ఇద్దరూ వేర్వేరు ముఠాలను తయారు చేశారు.
అధికారులకే బెదిరింపులు: ఈశ్వర్ ఉత్తర మండలంలోని ఓ ఠాణాలో పనిచేసినప్పుడు ఉదయం వెళ్లి సంతకం పెట్టి, విధులకు డుమ్మా కొట్టి దొంగలతో బేరసారాలు, సెటిల్‌మెంట్‌లు నడిపేవాడు. ప్రశ్నించిన ఇన్‌స్పెక్టర్‌కు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చేవాడు. బదిలీ చేయిస్తానంటూ బెదిరించేవాడు. చిన్నపిల్లలు, మహిళలతో ముఠాలు కట్టించి చోరీలు చేయించటం ప్రారంభించాడు. ప్రస్తుతం 4-5 ముఠాలకు చీరాల, హఫీజ్‌పేటలోని తన నివాసాల్లో బస ఏర్పాటుచేసి ఏపీ, తెలంగాణలో దొంగతనాలు చేయిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. పోలీస్‌స్టేషన్లకు వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడేవాడంటూ గతంలో బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. కేసులు, సస్పెన్షన్లున్నా.. వెంటనే పోస్టింగ్‌లు సంపాదించటం చర్చనీయాంశంగా మారింది. ఓ ఉన్నతాధికారి సహకారంతో అడ్డంకులు అధిగమించేవాడని తెలుస్తోంది.
సస్పెన్షన్‌కు చర్యలు.. ఈశ్వర్‌ను సస్పెండ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీచేశారు. ఇతనికి సహకరించిన ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఈశ్వర్ దారిలోనే ఉన్న మరో ముగ్గురు టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుళ్లపైనా విచారణకు ఆదేశించనట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: