Fake Visas: అమాయక మహిళలను టార్గెట్ చేసుకుని కువైట్‌లో ఉద్యోగాలంటూ నమ్మిస్తూ నకిలీ వీసాలు సృష్టిస్తున్న దళారుల నెట్‌వర్క్ బయటపడింది. గల్ఫ్ దేశాల్లోని దళారులతో మాట్లాడుకుని ఇక్కడి నుంచి పర్యాటక, సందర్శకుల వీసాలతో వారిని పంపుతున్నారు. ముంబయి కేంద్రంగా ఓ దళారి ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ నగరాల్లో సబ్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా మూడు నెలల్లో 200 మంది మహిళలను అక్రమంగా కువైట్‌కు పంపించాడని సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని ఓ ఏజెంట్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ముఠాకు శంషాబాద్ విమానాశ్రయంలో కొందరు సహకరిస్తున్నారని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
కలర్ జెరాక్స్‌లతో బురిడీ
ఘరానా ఏజెంట్లు నకిలీ పేర్లతో మహిళలకు వీసాలు తీసుకుంటున్నారు. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లలో పేర్లు మార్చి కలర్ జెరాక్స్‌లు తీసి పంపుతున్నారు. ఈ మూడునెలల్లో తూర్పుగోదావరి, కృష్ణా, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన పలువురు మహిళలను ఇలా తరలించారని పోలీసులు గుర్తించారు. శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వీసాలు, పాస్‌పోర్టులను పరిశీలిస్తున్న ఓ విభాగంలో పనిచేస్తున్న కొందరు ముంబయి, హైదరాబాద్ ఏజెంట్ల నుంచి కమీషన్ తీసుకుని సహకరిస్తున్నారని అనుమానిస్తున్నారు. ఈ ముఠా ప్రధాన ఏజెంట్ ముంబయిలో ఉన్నాడని తెలుసుకున్నారు. ప్రస్తుతం అతడు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు హైదరాబాద్ ఏజెంట్ల ద్వారా కువైట్‌కు వెళ్లిన మహిళల వివరాలు సేకరిస్తున్నారు.
మధ్యలోనే చించేసి...
మహిళలు ఒకే దేశానికి రెండు వీసాలు కలిగిఉన్నట్లు వెల్లడించిన అధికారులు... విజిటింగ్ వీసా ఇండియన్ ఇమిగ్రేషన్ వద్ద చూపించి ఎంప్లాయిమెంట్ వీసా కువైట్‌లో చూపిస్తున్నట్లు ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించారు. విజిటింగ్ వీసాతో ఫ్లైట్ ఎక్కి మధ్యలోనే దాన్ని చించేస్తున్నారని తెలిపారు. ముంబయిలో ఉన్న ప్రధాన ఏజెంట్ వీరిని దేశం దాటిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఏపీలో మరో ఇద్దరు సబ్ ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించారు.
ఇదీ చూడండి: Fake Visas: నకిలీ వీసాలతో కువైట్ వెళ్లేందుకు 44 మంది మహిళల యత్నం