Hyderabad Cyber Crime Today : ‘‘మీ కంపెనీ వ్యాలెట్ల నుంచి రూ.1.5కోట్లు కాజేసింది నేనే.. నాకు సహకరించిన ఐదుగురు నిందితులను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.. మీరు కేసు వాపస్ తీసుకుంటే మీ నగదు మొత్తాన్ని ఆరునెలల్లో ఇచ్చేస్తా.. లేదంటే మీకు ఒక్కరూపాయి కూడా రాదు..’’
- Telangana Cyber Crimes Today : బంజారాహిల్స్‌లోని ఓ కంపెనీకి సైబర్ నేరస్థుడు రెండు రోజుల కిందట పంపిన ఈ-మెయిల్ ఇది. మెయిల్ చూసి అవాక్కయిన కంపెనీ ప్రతినిధులు సైబర్‌క్రైం పోలీసులకు విషయాన్ని వివరించారు. మెయిల్‌కు స్పందించవద్దని, సైబర్ నేరస్థుడు కొల్లగొట్టిన నగదు.. బదిలీ విధానాన్ని గుర్తిస్తున్నామని త్వరలో నిందితుడిని పట్టుకుంటామని వారు చెప్పారు. భువనేశ్వర్ కేంద్రంగా ఈ భారీ మోసం జరిగింది. ఐదుగురు నిందితులను పట్టుకున్న ఇన్‌స్పెక్టర్ కృష్ణ బృందం సూత్రధారి కోసం గాలిస్తోంది.
కమీషన్లు ఇస్తానంటూ బ్యాంక్ ఖాతాలు.. ఈ-వ్యాలెట్‌లు
Cyber Crimes Today : రాజ్ పేరుతో ఓ సైబర్ నేరస్థుడు భువనేశ్వర్‌లో సీఎఫ్‌ఎల్ విద్యుత్ బల్బులు తయారు చేసి విక్రయిస్తున్న గోబింద్ర చంద్రను మూడు నెలల కిందట ఫోన్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. తాను వేర్వేరు వ్యాపారాలు చేస్తుంటానని, డిజిటల్ లావాదేవీల కోసం మీ వివరాలు కావాలని, నెలకు రూ.30వేలు ఇస్తానని చెప్పాడు. దీంతో గోబింద్ర చంద్ర వివరాలు ఇవ్వగా వాటి సాయంతో ఫోన్‌పే, గూగుల్‌పే తరహాలో ఈ-వ్యాలెట్‌ను తయారు చేసుకున్నాడు. లావాదేవీలు నిర్వహించేందుకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఒక పేమెంట్ గేట్‌వే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం కటక్‌లోని ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో పనిచేస్తున్న దినేష్ మహంతిని పరిచయం చేసుకుని తనకు బ్యాంక్ ఖాతాలు సమకూర్చాలన్నాడు. ఇదే తరహాలో బిమల్‌రాయ్, బలభద్రదాస్, మనోజ్‌కుమార్ రౌత్‌లతో మాట్లాడి కమీషన్లు ఇస్తానన్నాడు. ఈనెల తొలి వారంలో పేమెంట్ గేట్‌వే సంస్థ నుంచి రూ.1.5కోట్ల డిజిటల్ కరెన్సీని బదిలీ చేసుకున్నాడు. దినేష్, బిమల్, దాస్, మనోజ్‌లు సమకూర్చిన బ్యాంక్ ఖాతాల్లోకి పంపించాడు. తర్వాత వాటిని వేగంగా వేర్వేరు ఖాతాలకు పంపించుకున్నాడు.
పాత్రధారులు దొరకడంతో..
Cyber Crimes Latest : బంజారాహిల్స్‌లోని బాధిత కంపెనీ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు భువనేశ్వర్‌కు వెళ్లి ఐదుగురిని అరెస్ట్ చేశారు. రూ.1.5కోట్ల నగదును కొల్లగొట్టిన రాజ్ అనే వ్యక్తిని వీరిలో ఒక్కరు కూడా చూడలేదని తెలుసుకున్నారు. తాను బెంగుళూరులో ఉంటానని గోబింద్ర చంద్రకు సైబర్ నేరస్థుడు చెప్పాడని ఫోన్ రికార్డులు చూశారు. వీరి అరెస్ట్ సమాచారం తెలుసుకున్న నిందితుడు వెంటనే ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. అతడు రూ.1.5కోట్ల నగదును ఎక్కడెక్కడ విత్‌డ్రా చేసుకున్నాడన్న అంశంపై ఇన్‌స్పెక్టర్ కృష్ణ బృందం ఆధారాలు సేకరిస్తోంది. పోలీసులకు తన ఆర్థిక లావాదేవీలు తెలుస్తాయన్న భావనతో, నగదు వెనక్కి ఇస్తానంటూ సైబర్ నేరస్థుడు బాధిత కంపెనీకి మెయిల్ పంపించాడు.