తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్మాల్ కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు (ccs police investigation on Telugu academy fd scam) ముమ్మరంగా సాగుతోంది. తెలుగు అకాడమీ అధికారులతో పాటు.. యూనియన్, కెనరా, అగ్రసేన్ బ్యాంకు అధికారులను సీసీఎస్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తెలుగు అకాడమీ అధికారులు బ్యాంకులపై... బ్యాంకు అధికారులు అకాడమీపై పరస్పర ఆరోపణలు చేస్తుండటంతో.. ఒకేసారి వీళ్లందరినీ ప్రశ్నిస్తున్నారు.
సూత్రధారి ఎవరు..
తెలుగు అకాడమీ డైరెక్టర్, అకౌంట్స్ అధికారి సంతకాలు ఫోర్జరీ చేసినట్లు సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే డిపాజిట్ పత్రాలు, లేఖలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఫోర్జరీ చేసినట్లు తేలితే.. ఎవరు ఈ మోసానికి పాల్పడ్డారనే విషయాన్ని పోలీసులు తేల్చాల్సి ఉంటుంది.
వారిదే కీలక పాత్ర..?
రూ.63 కోట్ల డిపాజిట్లను అగ్రసేన్ బ్యాంకులోని ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాకు మళ్లించి.. అక్కడి నుంచి విడతల వారీగా నగదు విత్‌డ్రా చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ రెండో వారం వరకూ నగదును తీసుకున్నారు. ఏపీ మర్కంటైల్ సొసైటీ క్లర్క్ మొహిద్దీన్ ఆ నగదును నిందితులకు అందజేశారు. అయితే నగదు తీసుకున్నది ఎవరనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. యూనియన్ బ్యాంకు చీఫ్ మేనేజర్ మస్తాన్‌వలీకి సహాయకుడిగా వ్యవహరించిన రాజ్‌కుమార్.. ఈ తతంగంలో కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కస్టడీలోకి తీసుకొంటే..
రాజ్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురు ఏజెంట్లు.. నకిలీ డిపాజిట్ పత్రాలు, లేఖలు సృష్టించి మోసానికి (telugu academy scam news) తెరలేపినట్లు సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే మస్తాన్‌వలీతో పాటు ఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దీన్‌లను అరెస్ట్ చేశారు. ఈ నలుగురు నిందితులను పదిరోజుల కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. వీరిని విచారిస్తే.. మరికొంత సమాచారం వచ్చే అవకాశం ఉందని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు.
ప్రభుత్వం సీరియస్..
తెలుగు అకాడమీ ఫిక్సిడ్ డిపాజిట్ల స్కాంలో ప్రభుత్వం సైతం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. త్రిసభ్య కమిటీని నియమించింది. వీలైనంత త్వరగా ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు తెలుగు అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిపై వేటువేసిన సర్కార్.. అకాడమీ డైరెక్టర్ అదనపు బాధ్యతల నుంచీ తప్పించింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేనకు అదనపు బాధ్యతలు అప్పగించింది.
రూ.213 కోట్ల ఆస్తులు..
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ (Telugu academy scam).. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు పంచాలంటూ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. తెలుగు అకాడమీ సిబ్బంది, ఆస్తులను 58:42 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంది. ప్రస్తుతం అకాడమీ వద్ద రూ.213 కోట్ల ఆస్తులు ఉండగా.. ఏపీకి ఏపీకి రూ.124 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
ఇలా వెలుగులోకి..
ఆస్తుల పంపకాల నేపథ్యంలో.. భవనాలు, నగదు వివరాలను లెక్కిస్తుండగా.. వివిధ బ్యాంక్‌లతోపాటు యూబీఐ కార్వాన్, సంతోష్‌నగర్ శాఖల్లో రూ.43 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లున్నాయని (fixed deposits) తేలింది. గడువు తీరకముందే వాటిని తీసుకోవాలని అకాడమీ అధికారులు నిర్ణయించారు. ఈనెల 21న డిపాజిట్ పత్రాలు బ్యాంకుకు చేరినా అటువైపు నుంచి సమాచారం లేకపోవడంతో మూడు రోజుల తర్వాత తెలుగు అకాడమీ ఉద్యోగి రఫీక్ నేరుగా బ్యాంకుకు వెళ్లారు. ఆగస్టులోనే రూ.43 కోట్లు విత్‌డ్రా అయ్యాయని బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో నిగ్గు తేల్చాలని పోలీసులకు ఫిర్యాదుచేశారు.
సంబంధిత కథనాలు..