హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ వద్ద చిరు వ్యాపారుల మధ్య మామూళ్ల విషయంలో జరిగిన వివాదం హత్యాయత్నానికి దారి తీసింది. ఘటనపై ఫిర్యాదు అందుకున్న హుస్సేని ఆలం పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.
నవాబ్ సాహెబ్ కుంటకి చెందిన మహ్మద్ మజీద్, మహ్మద్ నహీద్ చార్మినార్ వద్ద చిరు వ్యాపారం చేస్తుంటారు. తలబ్కట్టకి చెందిన మహ్మద్‌కి.. మజీద్‌కు స్థల విషయంలో వివాదం ఏర్పడింది. మహ్మద్ నసీర్, సిద్దిక్ బిన్ మహ్మద్, సఫీ ఉద్దీన్‌తో కలిసి మహ్మద్ మామూళ్లు అడిగాడు. గొడవకు దిగి మజీద్, నహీద్పై రాడ్లతో హత్యాయత్నానికి పాల్పడగా.. తప్పించుకొని హుస్సేని ఆలం పోలీసులను ఆశ్రయించారు. వారు ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
చార్మినార్ వద్ద 54మంది చిరు వ్యాపారులకు జీహెచ్ఎంసీ అనుమతి ఇచ్చింది. అయితే వందల సంఖ్యలో దుకాణాలు పెట్టగా.. వారి నుంచి గల్లీ లీడర్లు వసూళ్లకు పాల్పడుతున్నారని దక్షిణమండల డీసీపీ గజారావు భూపాల్ తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. వ్యాపారులు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఇదీ చూడండి: కాలువలో పడిన కారు డ్రైవర్ మృతదేహం లభ్యం