Wife murder: జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త... ఆమె పాలిట యముడయ్యాడు. తాగొద్దు అన్నందుకు కట్టుకున్న భార్యనే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో చోటుచేసుకుంది. ఇంటిలో దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరు అనుకుంటారు కానీ అది పాత రోజుల సామెత. ఇప్పుడు ఎటువంటి ఘటనలు జరిగినా వెంటనే పట్టుకుంటున్నారు పోలీసులు. ఇప్పుడు ఈ హత్య కేసును సైతం పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా వాలేటివారిపాలెం మండలం పోకురు గ్రామానికి చెందిన ప్రవీణ్, భార్య ప్రియాంకతో కలిసి బతుకుతెరువుకోసం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామానికి వచ్చి మేస్త్రిగా పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.
ప్రవీణ్ విపరీతంగా మద్యం తాగడంతో భార్య ప్రియాంక అతనితో గొడవపడేది. ఈ నేపథ్యంలోనే భార్య భర్తల మధ్య తరచూ గొడవలు అయ్యేవి. గతంలోనూ వీరిద్దరికి గొడవలు జరగడంతో స్వగ్రామంలో పెద్దలు పంచాయితీ పెట్టి సర్దిచెప్పారు. ఇప్పుడు వలస వచ్చిన చిట్కుల్ గ్రామంలో సైతం ఇదే మాదిరిగా గొడవలు జరిగేవి. తాను మద్యం తాగేందుకు అడ్డువస్తుందని భావించి ఆమెపై పన్నాగం పన్ని ఈనెల 12వ తేదీన ఉదయం గొంతు నులిమి హత్యచేశాడు.
మృతురాలి సోదరుడు హరికృష్ణ ఫిర్యాదుతో పోలీసులకు అనుమానం వచ్చి పోస్టుమార్టం చేయించగా గొంతు నులిమి హత్యచేసినట్లు నివేదికలో తేలింది. దీంతో నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా భార్యను గొంతునులిమి హత్యచేశానని తెలిపాడు. అంతేకాక ఆమె మెడకు చీరచుట్టి... ఉరివేసుకుందని నమ్మించే ప్రయత్నం చేసినట్లు విచారణలో తేలింది. నిందితుడు ప్రవీణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చదవండి: