నవ వధువును భర్త హత్య చేసిన కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతినగర్‌లో 28 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న సుధారాణిని ఆమె భర్త కిరణ్‌కుమార్ గొంతు కోసి అంతమొందించిన సంగతి తెలిసిందే. భార్యను హత్య చేయడానికి అతను ముందస్తు ప్రణాళికను రూపొందించుకున్నట్లు తెలుస్తోంది.
ఇందుకోసం ప్రత్యేక ‘మడత చాకు’ను అంతర్జాలంలో ఆర్డర్ ద్వారా కొనుగోలు చేసినట్లు సమాచారం. 5 రోజుల ముందే దాన్ని ఆర్డర్ చేయగా హత్య జరగడానికి ముందురోజు అది డెలివరీ అయినట్లుగా పోలీసులు ప్రాథమిక ఆధారాలను సేకరించారు. చరవాణి అంత పొడవుంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి. దానితోనే సుధారాణి గొంతు కోసి తానూ గాయపరుచుకుని ఉంటాడని భావిస్తున్నారు. భార్యను హత్య చేశాక మృతురాలి బంధువులు తనను ఇబ్బందులు పెట్టే అవకాశాలున్నాయని భావించిన అతను కావాలనే అదే చాకుతో గాయపరుచుకుని ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నిజాంపేట రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న అతనికి ప్రాణాపాయం తప్పినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గొంతుకు అంగుళం లోతులో చర్మం తెగిందని వైద్యులు చెబుతున్నారు. ఆ కారణంగా సరిగా మాట్లాడలేకపోతున్నాడని సమాచారం.
గర్భం దాల్చిందని..
అనుమానంతో ఒకరు.. ఆగ్రహంతో మరొకరు.. క్షణికావేశంలో ఇంకొకరు.. ఇలా రాష్ట్రంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సొంతు కుమార్తె నుంచి కట్టుకున్న భార్య, కన్నతల్లి ఎవర్నీ వదలడం లేదు. డబ్బు కోసం ఒకరు, కామ వాంఛ తీర్చుకోవడానికి ఇంకొకరు, వివాహేతర సంబంధాలతో, అనుమానంతో కట్టుకున్న భార్యను హతమార్చేందుకు వెనకాడటం లేదు.