Husband killed his wife: ఖమ్మం జిల్లాలో మరో ఇంజక్షన్ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాకు చెందిన భిక్షం అనే వ్యక్తి అనస్థీసియా వైద్యుడి వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. అతడికి మొదటి భార్యతో సంతానం కలగకపోవడంతో తన కంటే 20 ఏళ్లు చిన్నదైన నవీన అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. ఆమెకు తొలుత పాప పుట్టింది. ఆ తర్వాత భార్యలిద్దరి మధ్య గొడవలు జరిగాయి.
తన రెండో భార్య మరోసారి గర్భం దాల్చింది. ప్రసవం కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. రెండోసారి ఆడపిల్లే పుట్టింది. భార్యలిద్దరి మధ్య గొడవలతో విసిగిపోయిన భిక్షం ప్రవసమైన రోజే నవీనకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడు. ఏమీ తెలియనట్టు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే చనిపోయిందని నమ్మించి బంధువులతో కలిసి ఆందోళనకు దిగాడు. ఆర్థికసాయం చేస్తామని ఆసుపత్రి యాజమాన్యం హామీ ఇచ్చింది.
అందుకు అంగీకరించిన నిందితుడు తన ఊరికి తీసుకెళ్లకుండా ఖమ్మంలోనే నవీన అంత్యక్రియలు నిర్వహించాడు. అనుమానం వచ్చిన ఆసుపత్రి సిబ్బంది సీసీకెమెరా దృశ్యాలు పరిశీలించారు. దీంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ప్రసవం జరిగిన రోజు అర్ధరాత్రి 2గంటల సమయంలో భిక్షం తన భార్య నవీనకు ఇంజక్షన్ ఇచ్చాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత వెళ్లిపోయాడు. ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రశ్నించగా నిందితుడు నిజం ఒప్పుకున్నాడు. మత్తు ఇంక్షన్‌తో భార్య ప్రాణం తీసిన నిందితుడిని కటకటాల్లోకి పంపించారు. ఖమ్మంలో ఇటీవల సూదిమందు ఇచ్చి జమాల్‌సాహెబ్ అనే వ్యక్తిని చంపేసిన ఘటనతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
ఇవీ చదవండి: