Husband Tried to Kill Wife: గత నెల 30న అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి మహిళ గొంతు కోసి హత్య చేసేందుకు ఆగంతుకుడు ప్రయత్నించిన కేసును సనత్‌నగర్ పోలీసులు ఛేదించారు. తన మిత్రుడైన జూనియర్ ఆర్టిస్ట్‌కు రూ.7 లక్షలు సుపారి ఇచ్చి మహిళ భర్తే ఈ ఘాతుకానికి ఒడినట్టినట్లు పోలీసులు గుర్తించారు. వివరాలను సనత్‌నగర్ సీఐ వెల్లడించారు. గత నెల 30న అర్ధరాత్రి 1.30 ప్రాంతంలో భరత్‌నగర్ కాలనీ మహేశ్వరినగర్‌లో నివసించే స్పందన(26)ను గుర్తుతెలియని వ్యక్తి ముఖానికి మాస్కు ధరించి ఇంట్లోకి చొరబడి కత్తితో గొంతుకోసి హత్య చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న భర్త వేణుగోపాల్ వారి ఏడాదిన్నర వయసున్న కుమార్తెను తీసుకుని వరండాలోకి వెళ్లాడు. అప్పుడే ఆగంతకుడు ఇంట్లోకి ప్రవేశించాడు. క్షతగాత్రురాలిని ఆసుపత్రికి తరలించగా ఆమె కోలుకుంది. కేసును ఛేదించడంలో సీసీ ఫుటేజీ కీలకమైంది.
గతంలో ఓసారి విఫలం..
స్పందన తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండటంతో వేణుగోపాల్ అనుమానం పెంచుకున్నాడు. హత్య చేయాలనే ఆలోచనతో యూసుఫ్‌గూడలో ఉండే మిత్రుడు, జూనియర్ ఆర్టిస్టు తిరుపతికి సుపారీ ఇచ్చాడు. గత ఏడాది డిసెంబరులో స్పందన తన మెట్టినిల్లు మెదక్ జిల్లా చేగుంటలో ఉన్నప్పుడు తిరుపతి కత్తితో దాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు. తిరుపతి ఇచ్చిన సమాచారం మేరకు వేణుగోపాల్‌ను సోమవారం అరెస్టు చేశారు.
ఇదీ చదవండి:గంజాయికి బానిసైన కుమారుడు.. స్తంభానికి కట్టేసి కంట్లో కారం చల్లిన తల్లి