Husband broke wife's Hand and Leg : సంతానం కలగలేదనే కోపంతో భార్యపై భర్త విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా డోన్ మండలం చనుగొండ్లలో జరిగింది. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను తల్లిదండ్రులు పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చందోలి గ్రామానికి చెందిన లాలప్ప, ఆదిలక్ష్మిల కుమార్తె భవానీని డోన్ మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన రాముకు ఇచ్చి మూడేళ్ల కిందట వివాహం జరిపించారు. పెళ్లైన నాటి నుంచి తమ కుమార్తెను వేధింపులకు గురిచేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు.
సంతానం కలగలేదనే కారణంతో భర్త, అత్తింటి వారు చిత్రహింసలకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా కాలు, చేయి విరిచేశారన్నారు. చావు బతుకుల మధ్య ఉందని సమాచారం తెలియటంతో.. అక్కడికి వెళ్లి తమ కుమార్తెను ఆటోలో తీసుకొచ్చామన్నారు. పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తరలించారు. తమ కుమార్తెపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన భర్త, ఆయన కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
'మా అమ్మాయికి పెళ్లై మూడు సంవత్సరాలు అవుతుంది. పిల్లలు పుట్టడం లేదని వారిద్దరిని ఆసుపత్రిలో చూపించాం. పిల్లలు పుట్టడం లేదని మా అమ్మాయిపై దాడి చేశాడు. దెబ్బలు తీవ్రంగా ఉండటంతో కర్నూలు ఆసుపత్రికి పంపించారు. పిల్లలు పుట్టడం లేదని వారు అంటున్నారే కానీ.. ఒక్కసారి కూడా ఆసుపత్రిలో చూపించింది లేదు. అత్తింటి వారు ఎప్పుడైనా ఆసుపత్రిలో చూపించారో వాళ్లను అడగండి. మా అమ్మాయిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన భర్త, ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు చర్యలు తీసుకోవాలి.'- భవానీ తండ్రి
ఇవీ చదవండి: