Ganja seize in train: గుట్టుచప్పుడు కాకుండా రైలులో గంజాయి తరలిస్తున్న ముఠాను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.67 లక్షల విలువ చేసే 336 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి ముంబయి వెళ్లే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ రైలులో లింగంపల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు భారీ మొత్తంలో గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
Ganja smuggling: రైలులోని ఏసీ బోగీలో ప్రయాణిస్తున్న ఏడుగురు మహిళలు, ఏడుగురు పురుషులు అక్రమంగా గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. మొత్తం 24 లగేజీ బ్యాగుల్లో అరకు నుంచి ముంబయి తరలిస్తున్నట్లు గుర్తించారు. అరకు సమీపంలో ఉన్న గ్రామాల్లో గంజాయి పండించే వారి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రయాణికుల ముసుగులో రవాణా
ganja in train: ఈ ముఠాలోని మహిళలు పోలీసులకు అనుమానం రాకుండా ప్రయాణికుల ముసుగులో వ్యాపారం చేస్తున్నట్లు వెల్లడించారు. పసిపిల్లలను వెంటబెట్టుకొని విశాఖ, అరకు నుంచి గంజాయి తరలింపు భారీగా జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు. విశాఖ నుంచి వచ్చే రైళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హైదరాబాద్ అర్బన్ రైల్వే డీఎస్పీ చంద్రబాను తెలిపారు.
ఎల్‌టీటీ వెళ్లే రైలులో మొత్తం 14 మంది విశాఖ నుంచి ముంబయి వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న మూడు బోగిల్లో అనుమానంతో తనిఖీలు చేశాం. వారి బ్యాగులు బరువుగా ఉండడంతో వాటిని తెరిచి చూశాం. వాటిలో గంజాయిని గుర్తించాం. వారిలో కొందరు మహిళలు చిన్నపిల్లలతో సహా వచ్చారు. వీళ్లందరినీ ఒక మహిళ లీడ్ చేస్తోంది. వీరికి మాయమాటలు చెప్పి ముంబయికి పంపుతోంది. ముంబయికి వెళ్లి గంజాయిని విక్రయిస్తున్నారు. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నాం. వీళ్లంతా ఆంధ్రకు చెందినవాళ్లే. వీరంతా కూడా కూలీలే. - చంద్రబాను, హైదరాబాద్ అర్బన్ రైల్వే డీఎస్పీ