సాధ్యం కాదన్నా వినకుండా..
సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ ద్వారా యువకులు, వృత్తి నిపుణులను భరత్‌పూర్, కోల్‌కతాకు చెందిన యువతులు పరిచయం చేసుకుంటున్నారు. ఒకటి, రెండు రోజులు ఫేస్‌బుక్ ద్వారా మాట్లాడిన తర్వాత వాట్సాప్ నంబర్లు తీసుకుంటున్నారు. వాట్సాప్ కాల్ మొదలైన నిమిషానికే దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా మారుతున్నారు.
- పెళ్లి చేసుకునేందుకు మరింత సమయం ఉంది.. అంతవరకూ ఒకరినొకరు పూర్తిగా తెలుసుకుందామంటూ చెబుతున్నారు. వాట్సాప్ వీడియోకాల్ మాట్లాడినప్పుడంతా నగ్నంగా ఉంటున్నారు.
- ఒకటి, రెండుసార్లు నగ్నంగా మాట్లాడాక మీరు నగ్నంగా మారి వీడియోకాల్ చేయండని కోరుతున్నారు. ఇంట్లో ఉన్నాను.. బంధువులు, స్నేహితుల మధ్య ఉన్నాను.. ఇప్పుడు చేయడం సాధ్యంకాదని చెప్పినా పదేపదే, వీడియోకాల్ చేస్తున్నారు.
- బాధితులు వీడియోకాల్ చేయడం మొదలు పెట్టగానే... మీ ముఖం కూడా కనిపించాలని కోరుతున్నారు. ముఖం కనిపించేలా మాట్లాడుతుంటే.. అవతలి వైపు మాట్లాడుతున్న యువతి మరో కెమెరాతో బాధితుడి మాటలు, దృశ్యాలను రికార్డు చేస్తుంది. కాల్ పూర్తైన ఐదు నిముషాలకు వీడియోను పంపి.. సామాజిక మాధ్యమాల్లో పెడతామంటూ బెదిరిస్తున్నారు.
రిపోర్ట్ కొట్టండి.. సెట్టింగ్ మార్చండి
అసభ్యకరమైన, అశ్లీల వీడియోలు పంపుతామని నేరస్థులు చెప్పిన వెంటనే మీ టైమ్‌లైన్‌లో.. ‘నా ఫేస్‌బుక్ హ్యాక్ అయ్యింది.. మీరు నాకు ఎలాంటి సమాచారం పంపొద్దు’’ అంటూ సందేశాన్ని పంపించండి.. ఈ సందేశాన్ని హ్యాకర్ చూసినా మీకు ఎలాంటి ఇబ్బందులు రావు..
● చరవాణిలో ఫేస్‌బుక్ తెరవగానే.. మూడు చుక్కలు కనిపిస్తాయి. వాటిపై నొక్కితే ‘రిపోర్ట్’ అని వస్తుంది. అందులో ‘‘ఎవరో మీలా నటిస్తున్నారా?’’ ‘‘మిమ్మల్ని సెలబ్రిటీలా మార్చారా?’’ ‘‘మిమ్మల్ని అనుకరిస్తున్నారా?’’ అన్నవి తెరపైకి వస్తాయి. ‘మిమ్మల్ని అనుకరిస్తున్నారా?’ అన్న ఐచ్ఛికాన్ని ఎంచుకుంటే... ఫేస్‌బుక్ ప్రతినిధులు హ్యాకర్‌ను తొలగిస్తారు. అప్పుడు మీ ఫేస్‌బుక్ సెట్టింగ్‌లను కొత్తగా మార్చుకోవాలి.