bangles were stolen from deceased : ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందిన వృద్ధురాలి బంగారు గాజులు మాయం చేసి వైద్య సిబ్బంది మానవత్వాన్ని మంటగలిపారు. ఈ ఘటన హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ రాజీవ్‌నగర్‌కు చెందిన 82 ఏళ్ల శారదమ్మ కొన్నేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. మూడు నెలల కిందట సెయింట్ థెరిసా ఆసుపత్రిలో చూపించగా వైద్యుల సలహా మేరకు జియాగూడలోని మరో ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. మళ్లీ సమస్య తలెత్తడంతో ఆమెను తిరిగి సెయింట్ థెరిసా ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు.
మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించే క్రమంలో వైద్య సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఆమె చేతులకున్న రెండున్నర తులాల బంగారు గాజులను మాయం చేసి చేతులు బయటకు కనిపించకుండా ఓ వస్త్రంలో చుట్టి మృతదేహాన్ని అప్పగించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు కార్యక్రమాలు చేపడుతుండగా ఆమె గాజులు కనిపించలేదని మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది.
ఇదీ చదవండి : సాంబార్ గిన్నెలో పడి చిన్నారి మృతి.