18ఏళ్ల యువకుడు హిజ్రాగా మారి.. మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇది. తనలాంటి వాళ్లు మరో ముగ్గురు హిజ్రాల చెరలో ఉన్నారని వీడియోకాల్‌లో చెప్పి పురుగుల మందు తాగాడు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం నక్కలబండ తండాలో ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
హిజ్రాగా మార్చారా..?
జడ్చర్ల పట్టణం నక్కలబండతండాకు చెందిన శ్రీకాంత్‌కు తల్లిదండ్రులు లేరు. తమ్ముడితో కలిసి అమ్మమ్మ దగ్గర ఉండేవాడు. ఏడాది కాలంగా శ్రీకాంత్ స్థానికంగా ఎక్కువగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. ఉన్నట్టుండి ఈ నెల 4న మేనమామ కుమారుడు వినోద్‌కు వీడియోకాల్ చేశాడు. తాను కడపలో ఉన్నట్లు, తనను కొందరు హిజ్రాగా మార్చినట్లు చెప్పాడు. హిజ్రాగా బంధువుల ముందుకు రాలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు.
వీడియోకాల్ కొనసాగుతుండగానే పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానిక నేతల ద్వారా బంధువులు జడ్చర్ల పోలీసులను సంప్రదించగా.. వారు కడప పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని కడప రిమ్స్‌లో చేర్పించారు.
మరో ముగ్గురు ఉన్నారా..?
చికిత్స పొందతూ శుక్రవారం మృతి చెందగా.. బంధువులెవరూ కడపకు వెళ్లలేదు. అందువల్ల బాధితుని మృతదేహాన్ని హిజ్రాలకే అప్పగించారు. శ్రీకాంత్‌లాగే జడ్చర్లకు చెందిన ముగ్గురు యువకులు ప్రస్తుతం హిజ్రాల చెరలో ఉన్నారని వీడియోకాల్‌లో శ్రీకాంత్ వెల్లడించాడు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ లాంటి యువకుల్ని బలవంతంగా హిజ్రాలుగా మార్చుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై ప్రస్తుతం బంధువులు, స్థానిక నేతలు ఆరా తీస్తున్నారు. దీనిపై పోలీసులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: మానేరు అందాలకు మురిసిన స్మితా సబర్వాల్