Die-hard Fan suicide: తాను ఆరాధించే నటుడి సినిమా బాగోలేదని మనస్తాపం చెంది ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు నగరంలోని తిలక్‌నగర్‌లో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన రవి.. వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల తన అభిమాన నటుడి సినిమా విడుదల కావటంతో.. శుక్రవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి థియేటర్‌కు వెళ్లి సినిమా చూశాడు. అనంతరం ఇంటికి వచ్చిన రవి.. సినిమా తాను ఆశించినంతగా లేదని.. తన అభిమాన హీరో సినిమాపై మిక్స్డ్ టాక్ నడుస్తోందని ఆవేదన చెందాడు. ఆ విషయమే ఆలోచిస్తూ తీవ్ర మనస్తాపానికి లోనై.. అదే రోజు రాత్రి ఉరేసుకొని నిండు జీవితాన్ని బలిచేసుకున్నాడు.
ఊరికి వెళ్లిన తల్లి అతడికి ఫోన్ చేయగా.. జవాబు ఇవ్వలేదు. శనివారం ఉదయం స్నేహితులు ఇంటి తలుపులు తట్టినా.. స్పందించలేదు. వెల్డింగ్ యంత్రంతో తలుపులు తొలగించి చూడగా.. పైకప్పుకు ఉరేసుకొని విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
నేటి తరం యువత విపరీత ఆలోచనలు ఎన్నో అనర్థాలకు దారితీస్తున్నాయని పోలీసులు తెలిపారు. చిన్న చిన్న కారణాలతో క్షణికావేశంలో విలువైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారని అన్నారు. ఏదైనా సమస్య ఎదురైనపుడు దాన్ని అధిగమించే ప్రయత్నం చేయకుండా.. ఆత్మహత్యే శరణ్యమనుకుని తమ ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించటం సరైంది కాదని సూచించారు.
ఇదీ చదవండి: