అధికారులు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా.. కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టినా.. శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి సుమారు రూ.4 కోట్ల విలువ చేసే 7.69 కిలోల బంగారాన్ని బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు నేడు తెలిపారు.
బుధవారం దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికులు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేయగా.. ఓ ప్రయాణికుడి నుంచి 4.895 గ్రాముల బంగారం, మరో ఇద్దరు ప్రయాణికుల నుంచి 2.800 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇటీవల కాలంలో ఇంత మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకోవడం ఇదేనని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
మరో ముగ్గురు.. మరో 3.5 కిలోల బంగారం..: శుక్రవారం సైతం దుబాయ్ నుంచి వస్తున్న ముగ్గురు ప్రయాణికుల నుంచి దాదాపు 3.5 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించగా.. లోదుస్తుల్లో దాచుకుని బంగారం సరఫరా చేసినట్లు గుర్తించారు. పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని డ్రాయర్లు, జాకెట్ల మధ్యలో దాచి తెచ్చారని.. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.1.4 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పట్టుబడిన వారిలో ఇద్దరు ముంబైకి చెందిన వారు కాగా.. మరొకరు హైదరాబాద్‌కు చెందిన మహిళగా అధికారులు గుర్తించారు.
ఇవీ చదవండి: