ఆంధ్రప్రదేశ్ విశాఖ సూర్యాబాగ్ ఘటన నిందితుడు హర్షవర్దన్ రెడ్డి మృతి చెందాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హర్షవర్దన్.. పరిస్థితి విషమించి ఈ రోజు ప్రాణాలు వదిలాడు. ఈనెల 13న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నం చేసిన నిందితుడు.. ఆ తర్వాత తానూ నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. తన ప్రేమను నిరాకరించిందనే కారణంతోనే యువకుడు హత్యాయత్నం, ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు తేల్చారు.
అసలేం జరిగింది?
ఆంధ్రప్రదేశ్ విశాఖ నగరంలోని సూర్యాబాగ్ ప్రాంతంలోని ఓ హోటల్లో శనివారం సాయంత్రం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నగరానికి చెందిన యువతి, తెలంగాణలోని భూపాలపల్లి ప్రాంతానికి చెందిన హర్షవర్థన్ రెడ్డి మంటల్లో కాలుతూ కనిపించడం.. సంచలనం రేకెత్తించింది. స్పందించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో యువతి నడుము భాగం నుంచి ముఖం వరకు తీవ్రంగా కాలిపోయింది. హర్షవర్థన్‌రెడ్డి ముఖం నుంచి కాళ్ల వరకు తీవ్రంగా గాయపడ్డాడు.
సాయంత్రం సుమారు 4.15 గంటల సమయానికి ప్రమాదం జరిగితే.. పోలీసులకు 6.30గంటలకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో యువకుడే ప్రధాన నిందితుడని తేల్చారు. యువతిని హత్య చేయాలన్న ఉద్దేశంతోనే వ్యూహం ప్రకారం విశాఖ వచ్చినట్లు నిర్ధారించారు.
నిందితుడిపై హత్యాయత్నంపాటు ఆత్మహత్యాయత్నం కేసులను నమోదు చేశారు. అలాగే పెట్రోలు పోసి నిప్పంటించడానికి ముందు తనతో తీవ్ర అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు ఆ యువతి ఆదివారం ఉదయం పోలీసులకు చెప్పడంతో.. హర్షవర్థన్ రెడ్డిపై లైంగిక వేధింపుల సెక్షన్లను కూడా జోడించారు.