- ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి తనను మానసికంగా వేధిస్తున్నట్లు యువతి ఫిర్యాదు చేసింది. రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రేమను తిరస్కరించిందనే అక్కసుతో ఆమె ఇంటి పక్కనుండే స్నేహితుడే మారుపేరుతో ఖాతా సృష్టించి ఇబ్బంది పెట్టినట్లు తేల్చారు.
- ఐటీ కొలువు చేస్తూ కూకట్‌పల్లిలో అద్దెకు ఉండే యువతికి ఆమె చిన్ననాటి స్నేహితుడు ఫోన్‌చేసి, తనకు ఉద్యోగం పోయిందని కొద్దిరోజులు ఉండేందుకు ఆశ్రయం కావాలని అభ్యర్థించాడు. ఒకే గ్రామానికి చెందిన వాళ్లు కావటం వల్ల సరేనంది. అతడు స్నేహితురాలు దుస్తులు మార్చుకొనే సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో ఉంచుతానంటూ బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు గుంజాడు. లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువతి తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యాయత్నం చేసింది. చుట్టుపక్కల వారు గమనించటంతో ప్రాణాలతో బయటపడింది.
స్నేహితుల ముసుగులో కొందరు మాయగాళ్లు బరితెగిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్స్ పరిధిలో సైబర్‌క్రైమ్, షీటీమ్స్‌కు సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు గురవుతున్నట్లు బాధితులు ఫిర్యాదు చేస్తుంటారు. నిందితుల్లో అధికశాతం వారి స్నేహితులు, పరిచయస్తులే ఉంటున్నట్టు సైబరాబాద్ షీటీమ్స్ ఇన్‌ఛార్జి డీసీపీ అనసూయ స్పష్టం చేశారు. సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది జూన్ వరకు షీటీమ్స్‌కు 97 ఫిర్యాదులు అందాయి. వాటిలో 16 ఫిర్యాదులు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలు, లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నవే..
మార్ఫింగ్ చేసి..
లాక్‌డౌన్‌లో యువత స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోవడం వల్లే సైబర్ నేరాలు పెరిగినట్లు పోలీసులు స్పష్టం చేస్తున్నారు. సామాజిక వేదికల్లో పరిచయమైన వారితో వ్యక్తిగత విషయాలు, చిత్రాలు పంచుకోవడమే ముప్పు తీసుకొస్తుందని చెబుతున్నారు. ఆ సమాచారంతో కొందరు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలో బాధితురాళ్ల పేరిట నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నారు. ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి వారికే పంపిస్తున్నారు. మేం చెప్పినట్లు వినకపోతే సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరిస్తున్నారు. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. నకిలీ ఖాతాలకు సంబంధించి యువతుల నుంచి ఫిర్యాదులు భారీగా వచ్చాయని వివరిస్తున్నారు.
అమ్మానాన్నలు భుజం తట్టాలి
యుక్తవయసులో సహజంగా ఉండే ఆకర్షణలకు గురైన యువత ఎక్కువగా ఇటువంటి వేధింపుల బారిన పడుతున్నట్లు ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్టు డాక్టర్ ఆరె అనిత విశ్లేషించారు. షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసే బాధితులను అడిగినప్పుడు తాము అవతలి వారిపై నమ్మకంతోనే సమాచారం పంచుకున్నామంటూ చెబుతున్నారని ఆమె వివరించారు. ఇంట్లో పిల్లల అపజయాలను వేలెత్తిచూపుతూ తిట్టే తల్లిదండ్రులు విజయాలను గుర్తించి ప్రశంసించటం అలవాటు చేసుకోవాలి. ప్రేమ, అప్యాయత, మెప్పుకోలు అన్నీ ఇంట్లోనే దొరికినప్పుడు బయటి వ్యక్తుల పొగడ్తలకు ప్రభావమయ్యే అవకాశం ఉండదన్నారు. యువత కూడా పరిచయమైన వారికి వెంటనే వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదంటున్నారు.
ఎక్కువమంది నేరచరిత్ర లేనివారే
''ఈ తరహా కేసుల్లో పట్టుబడిన నిందితుల్లో ఎక్కువ మంది ఎలాంటి నేర చరిత్ర లేనివారే ఉంటున్నారు. ప్రేమను తిరస్కరించడం, దూరం పెట్టడం, ఇతరులతో సన్నిహితంగా ఉండటం, ఛాటింగ్ చేయకపోవడం, పెళ్లికి ఒప్పుకోకపోవడం లేదనే అక్కసుతోనే ఇలా చేస్తున్నారు'' అని రాచకొండ సైబర్‌క్రైమ్స్ ఏసీపీ హరినాథ్ వివరించారు.
ఇవీ చూడండి:
ఫోన్లో మాట్లాడుతున్నారని.. బాలికలపై గ్రామస్థుల దాడి
ప్రేమించింది.. హిజ్రాగా మార్చింది... చివరికి ఏం చేసిందో తెలుసా?