Madapur Gun Firing case: నగరం నిద్రిస్తున్న వేళ రౌడీషీటర్లు రెచ్చిపోయారు. ఠాణాకు కూతవేటు దూరంలో తుపాకులతో విరుచుకుపడ్డారు. ఇటీవల హైదరాబాద్ శివారులోని కర్ణంగూడ వద్ద ఘటన మరువక ముందే.. తుపాకీ తూటాలకు మరో స్థిరాస్తి వ్యాపారి బలయ్యాడు. హైదరాబాద్ మాదాపూర్‌లో తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటన... నగరవాసులను భయాందోళనకు గురిచేసింది.
పాతబస్తీకి చెందిన రౌడీషీటర్లు ఇస్మాయిల్, ముజాహిద్ అలియాస్ ముజ్జుకు గతంలో జైలులో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి సన్నిహితంగా ఉంటున్న వీరిద్దరూ.. బయటికి వచ్చాక కలిసి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జహీరాబాద్‌లో ఉన్న స్థలానికి సంబంధించి వీరి మధ్య వివాదం మొదలైంది. గతంలో పలుమార్లు ఇరువురు స్థల వివాదం గురించి కలిసి మాట్లాడుకున్నారు. మరోసారి చర్చించి, పరిష్కరించుకుందామని... ఇస్మాయిల్, ముజాయిద్ రాత్రి తమ అనుచరులతో వేర్వేరుగా మాదాపూర్ నీరూస్ వద్దకు చేరుకున్నారు. ముజాహిద్‌తో పాటు అతని వెంట వచ్చిన జిలానీ... ఇస్మాయిల్‌పై తుపాకులతో కాల్పులకు తెగపడ్డాడు. దీంతో ఇస్మాయిల్ అక్కడికక్కడే కుప్పకూలగా... కాపాడేందుకు యత్నించిన అతని అనుచరుడు బుల్లెట్ నుంచి తృటిలో తప్పించుకుని గాయాలతో బయటపడ్డాడు.
ఘటనా స్థలికి చేరుకున్న ఇస్మాయిల్ అనుచరులు... రక్తపు మడుగులో ఉన్న ఇద్దరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఇస్మాయిల్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. గాయపడిన జహంగీర్‌కు చికిత్స చేశారు. కాల్పుల సమాచారం అందుకుని ఘటనా స్థలానికి బాలానగర్ డీసీపీ సందీప్ చేరుకుని... వివరాలు తెలుసుకున్నారు. క్లూస్‌టీం ఆధారాలు సేకరించింది. పరారీలో ఉన్న ముజాహిద్‌తో పాటు అతని అనుచరుల కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు... నిందితులను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు.
కాల్పుల్లో మృతి చెందిన ఇస్మాయిల్‌పై కాలపత్తర్ ఠాణాలో 10 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మూడేళ్ల క్రితం రౌడీషీట్ సైతం తెరిచినట్లు తెలిపారు. 4 కేసుల్లో నిర్దోషిగా బయటపడిన ఇస్మాయిల్.. న్యాయస్థానాల్లో మరో 6 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి: